అత్యంత చౌక నగరాల్లో బెంగళూరుకి చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత చౌక నగరాల జాబితాను తయారు చేయగా.. అందులో బెంగళూరుకి ఐదో స్థానం దక్కింది. చెన్నై 8వ స్థానం, ఢిల్లీ 10వ స్థానంలో ఉన్నాయి. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్( ఈఐయూ) ఇటీవల చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఇక అత్యంత ఖరీదైన దేశంగా సింగపూర్ నిలిచింది. ఖరీదైన నగరంగా మొదటిస్థానంలో నిలవడం సింగపూర్ కి ఇది ఐదోసారి.

ఈ సర్వే ప్రకారం.. ప్రపంచంలోనే ఖర్చులు తక్కువగా ఉన్న నగరాల్లో సిరియా రాజధాని డెమాస్కస్‌ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో వెనెజులా రాజధాని కారకాస్‌, మూడో స్థానంలో కజక్‌స్థాన్‌ వాణిజ్యకేంద్రం ఆల్‌మటి, నాలుగో స్థానంలో లాగోస్‌ ఉన్నాయి. 6వ స్థానాంలో పాకిస్తాన్‌లోని కరాచీ ఉంది. ఆల్‌గీర్స్‌ (7వ స్థానం), బుచారెస్ట్‌ (9వ స్థానం) ఇదే జాబితాలో ఉన్నాయి. ఆహారం, నీరు, దస్తులు, వ్యక్తిగత-గృహ సంరక్షణ ఉత్పత్తులు, ఇంటి అద్దెలు, రవాణా, వినియోగ బిల్లులు, ప్రైవేటు పాఠశాలలు, ఇంటి సహాయకులు (పనిమనుషులు), వినోద వ్యయాల వంటి 160 రకాల ఉత్పత్తులు, సేవలను 400 ప్రాంతాల్లో పరిశీలించి మరీ ఈ నివేదిక రూపొందించారు.