రైలు పట్టాలపై ఓ బ్యూటీషియన్ శవమై పడివున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇదే జిల్లా యాలాల్ కు చెందిన బ్యూటీషియన్ జ్యోతి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి రైల్లో తాండూర్ కి బైలుదేరింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ తెల్లారేసరికి  రైలు పట్టాలపై శవమై తేలింది.  

ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పగిడాల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్,కాశమ్మ ల కూతురు జ్యోతి. ఈమె హైదరాబాద్ శివారులోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి తాండూర్ లో నివాసం ఉంటుంది. అయితే అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని ఈ యువతి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ సమీపంలో శవమై తేలింది. 
  
రైల్వే పట్టాల సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని జ్యోతిది హత్యానా? ఆత్మహత్యానా? రైలు నుండి ప్రమాదవశాత్తు నుంచి పడిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.