పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ మంచి శరీర ఆకృతి ఉన్న వారు మాత్రమే ఈ అవార్డులకు అర్హులౌతారని కేంద్రం స్పష్టం చేసింది

భారీగా పొట్ట పెంచేసి.. కదలలేని స్థితిలో ఉంటూ కూడా విధులు నిర్వహిస్తున్న పోలీసులను మీరు చాలా మందినే చూసి ఉంటారు. అలాంటి పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ పోలీసులకు ఎలాంటి అవార్డులు, పతకాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని రష్ట్రాల పోలీసు శాఖలకు కేంద్రం సర్య్కులర్ కూడా జారీ చేసింది.

కేవలం పొట్ట ఉన్న పోలీసులకే కాదు.. సచ్చీలత లేని పోలీసులకు కూడా అవార్డులు పతకాలు రావని తేల్చి చెప్పింది. మంచి శరీర ఆకృతి ఉన్న వారు మాత్రమే ఈ అవార్డులకు అర్హులౌతారని కేంద్రం స్పష్టం చేసింది. శరీర ఆకృతి ఆధారంగా పోలీసులను షేప్‌-1, షేప్‌-2లుగా వర్గీకరించింది.

‘షేప్‌-1’ వర్గంలో ఉండే పోలీసులకే రాష్ట్రపతి పతకాలు అందజేస్తారు. మానసిక ఆరోగ్యం, వినికిడి, దృష్టి, శారీరక దృఢత్వం, శరీర సౌష్టవం, ఇతర అన్ని విషయాల్లోనూ బాగున్న వారిని ఈకేటగిరీ కింద గుర్తిస్తారు. పొట్ట ఉండకూడదన్న నిబంధనకూడా ఉంది. ఇలాంటి వారు ఏవిధులకైనా అర్హులన్నగుర్తింపు ఉంటుంది.

‘షేప్‌-2’ కేటగిరీలోని వారూ అన్నివిధులకు అర్హులే. అయితే తీవ్రమైన ఒత్తిడిఉండే విధులను కేటాయించరు. నిశిత దృష్టి, వినికిడి అవసరమున్న పనులకు కూడా పంపించరు. ప్రత్యేక సందర్భాల్లోనే ఇలాంటివారికి పతకాలు ఇస్తారు. పోలీసు పతకం పొందడానికి కనీసం 18 ఏళ్ల సర్వీసు, రాష్ట్రపతి పతకం పొందడానికి కనీసం 25ఏళ్ల సర్వీసు ఉండాలి. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకూ ఇదే నిబంధన వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి పొట్ట పోలీసులు ఇక మీ పొట్టను కరిగించే పనులు మొదలు పెట్టండి.