రాష్ట్రంలో ప్రభలుతున్న విష జ్వరాలపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. విష జ్వరాల కారణంగా లక్షలాది మంది మంచానపడుతున్నారని.. కేవలం రెండు వారాల్లో 80మంది మలేరియా జ్వరం కారణంగా మృతిచెందారని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుంటే.. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.సీఎం డ్యాష్ బోర్డు లెక్కల ప్రకారమే డెంగ్యూ బారినపడి ప్రకాశం జిల్లాలో గత వారం 50, ఈ వారం 49, గుంటూరులో గత వారం 44, ఈ వారం 56, విశాఖపట్నంలో గతవారం 72మంది, ఈ వారం 59మంది ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. గత వారం 272మంది డెంగ్యూ బారిన పడితే ఈ వారం వారి సంఖ్య 305కి పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు.

ప్రకాశం జిల్లాలో 109మందికి మలేరియా, 490మందికి డెంగ్యూ జ్వరం, 22,185మంది డయోరియా, 1400మందికి టైఫాయిడ్ జ్వరం ఉన్నట్లు తేలిందని అన్నారు. ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

ఈ విష జ్వరాలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని బత్తుల డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు.