Asianet News TeluguAsianet News Telugu

మధ్య తరగతి జనాలే బలి !

బ్యాంకుల ఛైర్మన్లు, ఆర్బిఐలో కీలక స్ధానాల్లో ఉన్నవారు సమర్ధులే అయితే రానిబాకీలను వసూలు చేసుకోవాలి. అంతే కానీ నిజాయితీగా పన్నులు కడుతున్నవారి నుండి, మధ్య తరగతి ఖాతాదారులను బాదటం కాదు.

Banks and rbi hitting the middle class people

డిమానిటైజేషన్ తర్వాత ప్రజలపై రెండంచెల దాడులు మొదలయ్యాయి. నోట్ల రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలపై ఒకవైపు బ్యాంకులు, ఇంకోవైపు రిజర్వ్ బ్యాంకు వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి వివిధ బ్యాంకులు ఖాతాదారుల ట్రాన్సాక్షన్లపై సర్వీసు ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. అంటే ఖాతాలో డబ్బులు వేసినా, తీసినా ట్యాక్స్ చెల్లించాల్సిందే. అలాగే ఖాతాలో కనీసమొత్తం నిల్వ లేకపోయినా ఇక బాదుడే బాదుడు. ఇప్పటికి బయటపడిన బాదుళ్ళు ఇవి. అంతర్గతంగా ఇంకెన్ని బయటపడతాయో తెలీదు. ఈ విషయంపైనే దేశవ్యాప్తంగా దుమారం మొదలైంది.

 

ఇదిలావుండగా, తాజాగా ఆర్బిఐ కూడా ఆంక్షలు పెడుతోంది. బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధల నుండి బంగారాన్ని కదవపెట్టి తీసుకునే రుణాల్లో రూ. 20 వేలకన్నా నగదు తీసుకునేందుకు లేదట. రూ. 20 వేలకన్నా ఎక్కువ తీసుకుంటే మిగిలిన మొత్తాన్ని చెక్ రూపంలోనే అందుకోవాలి. చెక్ అంటే మళ్ళీ బ్యాంకుకు పోకా తప్పదు, సర్వీసు ట్యాక్స్ కట్టకా తప్పదు. ఎక్కడవకాశం ఉంటే అక్కడల్లా జనాలను బాదటమే పనిగా పెట్టుకున్నట్లున్నాయి బ్యాంకులు, ఆర్బిఐ.

 

జనాలపై భారం మోపటాన్ని ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య సమర్ధించుకున్న విధానమే విచిత్రంగా ఉంది. 28 కోట్ల  జన్ ధన్ ఖాతాల్లో 11 కోట్ల ఖాతాలు ఎస్బీఐలోనే ఉన్నాయట. వాటిల్లో లావాదేవీలు లేకపోయినా వాటి నిర్వహణా వ్యయాలు మాత్రం తప్పటం లేదట. కాబట్టే వాటి భారాన్ని మిగిలిన ఖాతాదారుల మీద వేస్తున్నారట. ఎక్కడైనా విన్నారా అంత విచిత్రమైన వాదన. ఎవరో ఖాతా భారాన్నో ఇంకో ఖాతాదారునిపై వేస్తారా? బ్యాంకులకు జన్ ధన్ ఖాతాలు అంత భారమైతే వాటిని మూసేయించాలి. లేదంటే ఆ ఖాతాదారులపైనే భారాన్ని మెపాలి.  అంతే కానీ జన్ ధన్ ఖాతాలకు సంబంధం లేనివారిపై భారం మోపటమేమిటో?

 

ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పటి వరకూ తేలిన లెక్కల ప్రకారం అన్నీ బ్యాంకుల్లోనూ సుమారు 7 లక్షల కోట్ల రానిబాకీలున్నాయి. అందులో ఘనత వహించిన ఎస్టీఐ వాటా రూ. 95 వేల కోట్లు. రానిబాకీలంటే వందలు, వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగొట్టిన బాపతన్నమాట. అంటే విజయామాల్యా లాంటి వాళ్ళు. నిజంగా బ్యాంకుల ఛైర్మన్లు, ఆర్బిఐలో కీలక స్ధానాల్లో ఉన్నవారు సమర్ధులే అయితే రానిబాకీలను వసూలు చేసుకోవాలి. అంతే కానీ నిజాయితీగా పన్నులు కడుతున్నవారి నుండి, మధ్య తరగతి ఖాతాదారులను బాదటం కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios