Asianet News TeluguAsianet News Telugu

ఆందోళన బాటలో బ్యాంకు సిబ్బంది

కేంద్రం అనుసరిస్తున్న ధ్వంధ్వ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన బ్యాంకుల శాఖలున్న ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని అఖిల బారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, సమాఖ్య నిర్ణయించాయి.

bank employees are on war path

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశం మొత్తం మీద బ్యాంకుల సిబ్బంది ఆందోళన బాట పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పూటకో నిబంధన పెడుతూ కేంద్రప్రభుత్వం తుగ్లక్ చేష్టలను  మరిపిస్తోంది. దాంతో అటు ప్రజలు, ఇటు బ్యంకుల సిబ్బంది ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారు.

 

డబ్బులు ఇవ్వటానికి ఇబ్బందులేమీ లేవని కేంద్రమంత్రి ప్రకటిస్తారు. అదిచూసి ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంకులకు వస్తున్నారు. ఖాతాదారులకు పరిమితి విధించి ఇంతే ఇవ్వండంటూ బ్యాంకులకు ఆదేశిస్తున్నారు. దాంతో ప్రజలు బ్యాంకులపైన, సిబ్బందిపైనా దాడులు చేస్తున్నారు.

 

దేశంవ్యాప్తంగా బ్యాంకులపైన, సిబ్బందిపైనా దాడులు జరగటం రోజురోజుకు ఎక్కువైపోతోంది. ముందు ముందు పరిస్ధితి మరింత దారుణంగా దిగజారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాంతో కేంద్రంపై బ్యాంకుల సిబ్బంది, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

 

ఓ వైపు డబ్బుకు కొరత లేదని చెబుతూనే చెబుతూ మరోవైపు డబ్బుల వితడ్రా లో పరిమితి విధించటం కేంద్రం దివాలాకోరుతనానికి నిదర్శనం.

 

ఈ నేపధ్యంలోనే పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో ప్రజలందరికీ బ్యాంకులపై అనుమానాలు కలుగుతున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవైపు ప్రజావసరాలకు సరిపడా డబ్బుందని చెబుతూ మరోవైపు నగదు తీసుకోవటంలో ఖాతాదారులకు పరిమితులు పెట్టటం వల్ల బ్యాంకుల సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

 

కేంద్రం అనుసరిస్తున్న ధ్వంధ్వ వైఖరికి నిరసనగా ఈనెల 28వ తేదీన బ్యాంకుల శాఖలున్న ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని అఖిల బారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, సమాఖ్య నిర్ణయించాయి. అదేవిధంగా జనవరి 3వ తేదీన ఆయా ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని కూడా సిబ్బందికి పిలుపిచ్చాయి.

 

ప్రజావసరాలకు సరపడా డబ్బున్నపుడు డబ్బులు ఇవ్వటంలో ఖాతాదారులకు పరిమితి విధించాల్సిన అవసరం ఏమిటని ఏఐబఇఏ ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏషియానెట్ తో మాట్లాడుతూ, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల ఖాతాదారుల ముందు బ్యాంకు సిబ్బంది దోషులుగా నిలబడాల్సి వస్తోందని వాపోయారు.

 

ఈ కారణం వల్లే పలు చోట్ల బ్యాంకులపైన, బ్యాంకుల సిబ్బందిపైనా ఖాతాదారులు దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు. తమకున్న సమాచారం ప్రకారం ఖాతాదారుల అవసరాల మేరకు నగదు ఇవ్వటానికి కేంద్రం వద్ద నగదు లేదన్నారు. ఆ విషయాన్ని అంగీకరించకుండా కేంద్రం ప్రజలను గందరగోళ పరుస్తున్నట్లు రాంబాబు అభిప్రాయపడ్డారు.

 

బ్యాంకులపైన, సిబ్బందిపైన దాడులు జరపకుండా తగిన రక్షణ చర్యలు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. అవసరాలకు సరిపడా డబ్బులు కేంద్రం ఇవ్వకపోతే తాము ఎక్కడి నుండి తెచ్చి ఖాతాదారులకు డబ్బులు సర్దుబాటు చేయగలమని ప్రశ్నించారు. కేంద్రం ఆదేశాలను అమలు చేయటానికి ఎంతటి శ్రమకైనా సిద్ధమేనని కూడా స్పష్టంగా చెప్పారు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios