పవన్ కల్యాణ్ ఆవేశానికి గద్దర్ పాట తోడయ్యేలా ఉంది. పవన్ , గద్దర్ ల మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయి. పవన్ తో గొంతు కలిపే ముందు గద్దర్ పవన్ ప్లాన్ మీద మరింత సమాచారం కోరారు.
జనసేన నాయకుడు పవన్ కల్యాన్ యోచిస్తున్న దక్షిణం రాజకీయాలతో గొంతుకలిపేందుకు విప్లవగాయకుడు గద్దర్ సిద్ధంగా ఉన్నారు.
పవన్ తరచూ ఈ మధ్య ఉత్తరాది అహంకారం గురించి మాట్లాడుతున్నారు. దక్షిణాది ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటున్నదో ఆవేదన చెందుతున్నారు. అందువల్ల ఆయన సౌత్ ఇండియా ఫోరం ఏదో పెట్టేయోచనలో ఉన్నట్లున్నారని గద్దర్ అంటున్నారు. ఆయనతో కలసి పని చేసేందుకు గద్దర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదే జరిగితే, పవన్ ఆవేశానికి గద్దర్ పాట తోడవుతంది. నిన్న జరిగిన ఒక సమావేశంలో ప్రజాగాయకుడుగా పేరున్న గద్దర్ ఏమన్నారో చూడండి.
పవన్ తనకు తమ్ముడని, కొన్ని వివరాలు కోరుతూ ‘వాడి’కి ఉత్తరం రాశానిని గద్దర్ వెల్లడించారు.
‘‘తమ్ముడు కూడా సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అంటున్నాడు కదా? సౌత్ ఇండియా అంటే కేరళ, కొంకిణి, పలు రాష్ట్రాలు, అనేక భాషలు ఉంటాయి. తమ్ముడికి ఒక ఉత్తరం రాశాను. దీని మీద ఆయన అభిప్రాయం, అవగాహన ఏంటో చెప్పాలని కోరాను. ఉత్తరానికి పవన్ స్పందన ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నా,’అని గద్దర్ అన్నారు.
‘పవన్ కల్యాణ్‌అంటే నాకు తమ్ముడు. నాకంటే చిన్నోడే కదా. నేను వాడిని తమ్ముడు అని పిలుస్తా. పవన్ నా ప్రియమైన వాడు.’’ అని పవన్ తో తనకున్న అనుబంధం ఎలాంటిదో ఆయన వివరించారు.
పవన్ తో భవిష్యత్తులో చేతులు కలపడం మీద స్పష్టత ఇస్తూ, ‘ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీ పుట్టినట్లే తెలంగాణా పునర్నిర్మాణం కోసం మరొక పార్టీ అవసరంఉంది,’ అని గద్దర్ అభిప్రాయపడ్డారు . గురువారం నాడు హైదరాబాద్ లో జరిగిన ‘మహాజన సమాజం’ ఆవిర్భావ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తను స్థాపించిన ఈ మహాజన సమాజం ప్రస్తుతానికి ఇది ప్రజాసంఘంగానే ఉంటుందని అన్నారు. ఇదే దారిలో వెళుతుందో త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.
