Asianet News TeluguAsianet News Telugu

బేబీ మీనా శరీరం బోరుబావిలో ఎందుకు ముక్కలైంది. బాధ్యులెవరు?

  • బోరుబావిలో పడ్డ చిన్నారి మీనా కథ విషాదాంతం
  • కనీసం కన్నవారి కడచూపుకు కూడా దక్కని మీనా మృతదేహాం
  • 60 గంటలకు పైగా శ్రమించి చివరకు మిగిలించింది మాంసపు ముద్దలేనా
  • అధికారుల్లో సమన్వయం లేకనే బేబీమీనా బోరుబావిలో ముక్కలైపోయిందా
baby meena who fell in bore well disappeared and residues came out after flushing

బోరుబావిలో జారిపడిన చిన్నారి మొదట పది అడుగుల లోతుల్లోనే చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు.. బోరు మోటారును పైకి లాగితే పాప బయటకు వస్తుందని భావించారు. అనుకున్నదే తడువుగా మోటారును కొంతమేర లాగారు. అయితే లోపలి నుంచి ఏడుపు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. కానీ ఇక్కడే సరిగ్గా ఆలోచించి ఉంటే పాప ప్రాణాలతో సునాయాసంగా బయటపడేది. పాప పది అడుగుల లోతులో ఉన్నప్పుడే సమాంతరంగా తవ్వి తీస్తే పాప ప్రాణాలతో దక్కేది. కానీ మోటారు లాగే క్రమంలో పాపకు గాయాలైతే ఎలా అనే సందేహం గట్టిగా అనిపించి ఉంటే కన్న వారికి గర్భశోకం మిగిలేది కాదు.

 

అంతా మోటారు లాగటం వల్లేనా...

మోటారు లాగే క్రమంలోనే పాప 10 అడుగుల నుంచి 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది. ఆ తర్వాత యంత్రాంగం చేరుకోవడం.. సహాయక చర్యలు చేపట్టడం మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటారును బయటకు తీస్తే.. దాంతోపాటు పాప కూడా బయటకు వస్తుందని భావించారు. మోటారును పైకి లాగే క్రమంలో బలంగా గుంజడంతో ఒక్క ఉదుటున మోటారు బయటకు వచ్చింది. కానీ దీంతో అప్పటివరకు కనిపించిన పాప కదలికలు కనుమరుగయ్యాయి. ఈ ప్రయోగమే పాపకు అపాయం తలపెట్టింది.  

బోరుబావి చుట్టుకొలత 40 అడుగుల వరకు తొమ్మిది అంగుళాలే ఉంది. చిన్నారి ధరించిన గౌను సైజు 8.5 అంగుళాలు. అంటే పాప ఎట్టి పరిస్థితుల్లో కిందకు జారే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 40 అడుగుల తర్వాత బోరుబావి చుట్టుకొలత 6.25 అంగుళాలు ఉన్నందున.. పాప మరింత లోతుకు వెళ్లే అవకాశం లేదన్నారు.

ఇక 10 అడుగుల లోతుల్లో చిక్కుకున్నప్పుడే పాపను రక్షించేందుకు సమాంతర గొయ్యి తవ్వితే ఫలితం ఉండేదని, కానీ హడావుడిగా స్థానికులు చేసిన ప్రయత్నంతో పాప 40 అడుగులకు జారిపోగా.. ఆ తర్వాత మోటారును బలంగా లాగడంతో పాప ఆచూకీ కూడా లభించకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇంజనీరింగ్‌ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. బోరు మోటారు పైకి లాగే సమయంలోనే పాప ప్రాణానికి ముప్పు వాటిల్లి ఉండవచ్చని అన్నారు.

‘‘మోటారును బయటకు తీస్తున్నప్పుడు బోరు పక్క భాగాల్లో పాప అతుక్కుపోవచ్చు. కానీ తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాని పక్షంలో అడుగుభాగంలో (దాదాపు 500 అడుగులు) కూరుకుపోయి ఉండొచ్చు. ఏదేమైనా పాపను రక్షించే క్రమంలో కొంత సంయమనం, సమన్వయం పాటిస్తే బాగుండేది’’అని ఆయన అన్నారు.

అయితే ఇంతలా ఈయన చెప్తున్నది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికైనా అంటే.. కనీసం అక్షరాలు రాని వారికైనా తోస్తుంది. మరి అలాంటప్పుడు మోటారును బయటికి లాగితే మరింత ప్రమాదం జరుగుతుందని తెలిసీ ఆ పని చేశారా.. అంటే అవుననే అనిపిస్తోంది. మోటారు బలంగా లాగితే పాప శరీరానికి గాయాలవుతాయన్న కామన్ సెన్స్ కూడా మన అధికారులకు లేదా..కాక మరేంటి. ఆ మాత్రం సమన్వయం లేకపోవడం వల్లే ఎవరికి తోచినట్టు వాళ్లు చేయడంటో ఆఖరికి పాపను కడసారి చూపుకు కూడా లేకుండా చేశారు.

నిజానికి శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్‌ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్‌ వాటర్‌ప్రూఫ్‌ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు.

ఇక చేసేది లేక ఆదివారం వేకువ జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చివరి ప్రయత్నం చేశారు. అంటే అప్పటికే పాప చనిపోయిందని రెస్క్యూ టీమ్ కు తెలుసు. అయితే ఫ్లషింగ్‌తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

శరీరం కోసం మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఘటనా స్థలంలో ఉన్న ప్రతి హృదయాన్నీ కదిలించింది. కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది. శవ పరీక్ష కోసం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios