హైదరాబాద్: తమ పార్టీకి చెందిన కర్ణాటక శాసనసభ్యులను హైదరాబాదుకు తరలించాల్సి రావడంపై కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

బెంగళూరు రిసార్ట్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బిజెపి బెదరింపులకు గురి చేసిందని, దాంతో విమానంలో కేరళకు తరలించాలని అనుకున్నామని, అయితే అక్కడ అనుమతి లభించలేదని, దాంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకుని వచ్చామని ఆయన వివరించారు. 

బిజెపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. శాసనసభలో బలనిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడం దేశ చరిత్రలో ఇంత వరకు లేదని, పలు రాష్ట్రాల్లో ఎక్కువకు ఎక్కువ వారం రోజుల గడువు ఇచ్చారని ఆయన చెప్పారు 

యడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, న్యాయవ్యవస్థపైనే ప్రజలకు విశ్వాసం ఉందని అన్నారు. 

తాము కూడా గవర్నర్ ను కలిసి తమకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితాను సమర్పించామని ఆయన చెప్పారు తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. బలనిరూపణ అనేది తదుపరి విషయమని, ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఏ ప్రాతిపదికన గవర్నర్ ఆహ్వానించారనేది ప్రశ్న అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కర్ణాటక గవర్నర్ ఖూనీ చేశారని అన్నారు.