జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్లను ఇక ముందు కొనడం మరింత కష్టం. ఆడి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కో మోడల్ కారు ధర కనీసం రూ.లక్ష నుంచి రూ.9లక్షల దాకా పెరగనుంది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

 ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆడి అన్ని మోడళ్ల కార్లపై 4శాతం ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. మోడల్‌ను బట్టి కార్లపై రూ. లక్ష నుంచి రూ. 9లక్షల వరకు ధరలు పెరగనున్నాయి. భారత మార్కెట్లో ఎస్‌యూవీ రేంజ్‌ నుంచి స్పోర్ట్స్‌ కారు‌ వరకు ఆడీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

వీటి ధరలు రూ. 35లక్షల నుంచి రూ. 2.63కోట్ల వరకు ఉంటాయి. మాములుగానే ఇంత ధర పెట్టి కార్లు కొనడం చాలా కష్టం. సంపన్నులు మాత్రమే ఈ కంపెనీ కార్లను కొంటారు. ఇప్పుడు మరింత పెరగడంతో.. ఈ మోడల్ కారు మీద చాలా మంది ఆశలు వదులుకునే అవకాశం ఉంది.