చెట్టుతల్లిని ఆలింగనం చేసుకుని చెట్టుకోసం నిలబడతానని కేరళలో జరిగిన ట్రి హగ్గింగ్  ప్రతిజ్ఞకు గినిస్ రికార్డు

“పండ్లను ఇవ్వడమే తప్ప

తీసుకోవడం తెలియని

 తల్లి మనుసులా తరువు ...

ఒట్టూ! చెట్టు నా ఆత్మ”


అని ప్రఖ్యాత కవి జూకంటి జగన్నాధం చెట్టును ముద్దాడాడు.

వెనకటికెవరో మంచిమనిషిని చెట్టంత మనిషి అని చెట్టును ఆకాశానికెత్తారు.

అవును నిజమే చెట్టును చూస్తే... అలా చూస్తూ ఉండిపోవాలని పిస్తుంది. ఇలా కదలకండా యుగాలు నిలబడి, మనకు జీవితాన్నిచ్చే చెట్టుని అప్యాయంగా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది. చేతులేసి అమ్మలా చుట్టేసుకోవాలనిపిస్తుంది. చెట్టుపుట్ట లేని చోట జీవితమేముంటుంది, ఎడారి.

అందుకే ఏసియానెట్ చెట్టును ఆలింగనం చేసుకునే ఒక మహత్తరమయిన కార్యక్రమం కేరళలో ఏర్పాటు చేసింది. చెట్టును ఆలింగనం చేసుకోవడమనేది కొత్తకాదు. ఎప్పటి నుంచో వుంది. మనిషెపుడూ చెట్టును తల్లిలాగే ప్రేమించాడు, దేవతలాగా పూజించాడు. చెట్టు చుట్టూర చేతులేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడమెపుడూ పాతబడదు.

 అయితే, ఇపుడు ఎదురవుతున్న దుర్దశనుంచి చెట్టును కాపాడుకోవలసి వస్తాంది.

ఒకప్పుడు చెట్ల మధ్యనుంచే బాటలుంటే, ఇపుడు రోడ్లకు చెట్లు అడ్డమొస్తున్నాయ్, భవంతులకు, ప్రాజక్టులకు చెట్టు చెరుపవుతూ ఉంది. చెట్టు ఎవరికీ పనికిరాని అనాథ అవుతూ ఉంది. చెట్టును కూకటి వేళ్లపెకలించే సంస్కృతి చుట్టూర అలముకుంటూ ఉంది.

“ My Tree, My Life” పేరుతో తిరువనంతపురం సమీపంలోని జవహర్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ఇన్ స్టిట్యూట్ (జెఎన్ టి బిజిఆర్ ఐ) లో గత మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఈ కార్యక్రమం గినిస్ రికార్డవుతుందని ఎవరూ వూహించలేదు. ఒకేసారి వేలాది మంది చెట్లను ఇలా ఆలింగనం చేసుకోవడం ఒక రికార్డని గినిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొనింది(పక్క ఫోటో).

ఇంతవరకు, గుజరాత్ లో 2016 డిసెంబర్ 3, టాటాకెమ్ డిఎవి పబ్లిక్ స్కూల్ ఏర్పాటుచేసిన ఇలాంటి కార్యక్రమంలో 1316 మంది పాల్గొనడమే రికార్డు.

అయితే, మంగళవారంనాటి కార్యక్రమం ఉత్తేజకరమయిన పాటలతో నినాదాలతో మొదలయింది. 4620 మంది పాల్గొనడంతో గినిస్ రికార్డ యిందని గినిస్ ప్రపంచ రికార్డు ప్రతినిధి ప్రకటించారు. రికార్డు సర్టిపికెట్ ఎసియానెట్ న్యూస్ బిజినెస్ హెడ్ ఫ్రాంక్ థామస్ కు అందించారు. నిజానికి ఈ కార్యక్రమంలో 4793 మంది పాల్గొన్నారు. అయితే, చివర్లో కొంతమంది అనర్హులయ్యారు. అయినా సరే, చెట్టుతో ఆలింగనం కార్యక్రమం రికార్డు పూర్తయింది.

ఈ కార్యక్రమాన్ని ఏసియానెట్ న్యూస్, బొటానికల్ గార్డెన్ సంయుక్తంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశాయి. చెట్లను కాపాడతామని ఒక నిమిషంపాటు ఆలింగనం చేస్తూ ప్రతినపూనడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ పి సదాశివన్ పాల్గొన్ని అందరితో పాటు ఒక చెట్టుతల్లిని ఆలింగనం చేసుకుని చెట్టుకోసం నిలబడతానని ప్రతిజ్ఞచేశారు.

“ఇదెంతో ముచ్చటేసే కార్యక్రమం. చిన్న పిల్లలు చెట్టును అమ్మలా చుట్టేసుకోవడం అందంగా ఉంది. వీళ్లనిలా చూస్తూ ఉంటే ఆనందమేస్తావుంది. ఇదొక నూతనాధ్యాయం కావాలి. చెట్టుబతకాలి. మనల్ని బతికించాలి,” అని గవర్నర్ అన్నారు, నిర్వాహకుల భుజం తట్టారు.

అంతకు ముందు పొద్దున, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య, అనేక మంది కళాకారులతో కలసి కేరళ అటవీ శాఖ మంత్రి ఈ చెట్టుతో ‘ఆలింగనం’ ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు.

కార్యక్రమంసాగుతన్నంత సేపు కనుచూపు మేర విస్తరించిన బొటానికల్ గార్డెన్ పాటలతో కేరింతలతో మారుమోగింది.