అమరావతికి ప్రపంచ స్థాయి ‘నలంద’ విశ్వవిద్యాలయం
  


ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన అప్పుడే ఫలితాలనిస్తున్నదని అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. శుక్రవారం  న్యూయార్కు లోని బ్యాంక్ ఆఫ్  అమెరికా మెర్లిల్లించ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అమరావతిలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నలందా 2.0 సంస్థ  సంసిద్ధత తెలియజేసిందని ఒక ప్రకటనలో సిఎంఒ తెలిపింది.   ప్రపంచంలో మొదటి 25 ర్యాంకులలో ఒకటిగా నిలిచేలా అమరావతిలో వరల్డ్ క్లాస్ యూనివర్శిటీ ఏర్పాటుకు సుముఖంగా వున్నామని నలందా 2.0 వ్యవస్థాపక అధ్యక్షుడు షాయిల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పలు వాణిజ్య, వ్యవసాయ, ఆహార సంస్థల ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. 
 అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉన్న మాగ్నా ఇంటర్నేషనల్ ఏపీకి వచ్చి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని  మాగ్నా ఇంటర్నేషనల్ సీటీవో స్వామి కోటగిరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి  బదులిచ్చారు. ప్రపంచం ప్రస్తుతం ఎలెక్ట్రిక్  వాహనాలకు మళ్లే దిశగా వెళ్తోందని, ఈ పరిణామానికి ఆంధ్రప్రదేశ్ తప్పకుండా మార్గదర్శిగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 
 భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ‘హ్యాపెనింగ్ స్టేట్’గా ఉందని నీతిఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పనగారియా మాట్లాడుతూ తాను  నీతిఆయోగ్ ఉపాధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగిందని అన్నారు. 
ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్రప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు. 
బ్యాంక్ ఆఫ్  అమెరికా మెర్లిల్లించ్ లో జరిగిన ఈ  సమావేశంలో  చటర్జీ గ్రూప్ చైర్మన్ డా. చటర్జీ, మాగ్నా ఇంటర్నేషనల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్వామి కోటగిరి, నలందా 2.0 వ్యవస్థాపకుడు షాలి కుమార్. న్యూ సిల్క్ రూట్ కంపెనీ సీఈఓ పరాగ్ సక్సేనా, ‘నీతిఆయోగ్’ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా,  ఎస్.వి.పి ఫైజర్ కు చెందిన  జెఫ్ హ్యామిల్టన్, టేస్టీ బైట్ ఈటబుల్స్ సంస్థ చైర్మన్ అశోక్ వాసుదేవన్ టిష్ మ్యాన్ స్పీయర్ సంస్థ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ స్పీస్, ఎస్&పి గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హెడ్ స్వామి కొచ్చర్లకోట, వెనెక్లేశన్ అసోసియేట్స్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ డా. మహావీర్ అత్వాల్ , యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ అఘీ తదితరులు పాల్గొన్నారు. 
  

ఏదులబాద్ చెరువులో వేల చేపలు మృతి

హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ చెరువులో కలుషిత తీవ్రమయింది. చెరువును కాపాడేందుకు ఎలాంటి చర్యలుతీసుకొనకపోవడం  పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చెరువులోని నీరు విషపూరితం కావడం వల్లనే ఈ చేపలు మృతి చెందాయని స్థానికులు చెప్పారు.. మృతి చెందిన చేపల విలువ ఎనిమిది నుంచి పది లక్షల  రూపాయలు ఉంటుందని మత్సకారులు తెలిపారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు నుంచి రసాయన వ్యర్థాలు చెరువులోకి  ట్రీట్ మెంట్ లేకుండా  కలవడం వల్ల చెరువులోని నీరు విషపూరితమయ్యాయని అందువల్లే  చేపలు ఇలా మృతి చెందాయని  మత్సకారులు ఆరోపిస్తున్నారు. ఇది తమ జీవనోపాధిని దెబ్బతీసిందని చెబుతూ  తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో భూమి కంపించింది

 

హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూమి కంపించింది. నగరం నడిబొడ్డున ఉన్న యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరానగర్, ప్రతిభానగర్ తదితర ప్రాంతాల్లో కూడ  భూమికంపించిందని  స్థానిక ప్రజలు తెలిపారు. ఇది తెల్లవారు జామున 3 నుంచి 3.30 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు.  భూప్రకంపనలు సంభవించిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి వివరాలు సేకరించారు.

అమెరికా నుంచి దుబాయ్ చేరుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఈ రోజు దుబాయ్ బయలుదేరారు ఇప్పటికే N R I వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దుబాయ్  చేరుకున్నారు.శనివారం ,ఆదివారం రెండు రోజుల దుబాయ్ లో పర్యటించనున్నారు.ఈ రోజు దుబాయ్ లోని భారతీయ పాఠశాల లో అక్కడ ఉన్న ప్రవాసాంధ్రుల తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం N R T  సంస్ద అధ్వర్యంలో రూపోందించిన ప్రవాసీ సంక్షేమ విధానం లో భాగంగా ,ప్రవసాంద్ర భరోసా, ప్రవాసాంద్ర హెల్ప్ లైన్ ,కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. దుబాయ్ రాజు షెక్ మహమ్మద్ రాషెద్ అల్ మఖ్తాంతో పాటు ఇతర అధికారుల తో సమావేశమవుతారు.ఎమిరేట్స్ చైర్మన్ షేక్ మహమ్మద్ అల్ మఖ్తాంతో కూడా ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అబుదాబి వెళ్ళి యువరాజు అల్ నహ్యన్ అయన సోదరులతో భేటీ అవుతారు 

జగిత్యాలలో కాల్పులు కలకలం

తెలంగాణ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ముగ్గురు దుండగులు రాజన్న అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యారు. స్థానికులు బాధితున్ని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల సమయంలో దుండగులు తాము నక్సలైట్లమని చెప్పినట్లు రాజన్న తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. రాజన్న యమాపూర్ మాజీ సర్పంచ్ అని తెలిసింది.

వెంకయ్య ఆరోగ్యం బాగుంది, ఈ రోజు అసుప్రతి నుంచి ఇంటికి

నిన్న అస్వస్థతతో  ఢిల్లీలోొ ని ఎయిమ్స్ లో చేరిన  రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు యాంజియోగ్రఫీ చేసి స్టెంటు వేశారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

బీపీ, షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో శుక్రవారం ఉదయం 8 గంటలకు వెంకయ్యను ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

ఆయనను కార్డియో న్యూరో సెంటర్లో చేర్చారు. 

వాస్తవానికి, ఉప రాష్ట్రపతి అయిన వెంటనే గత ఆగస్టులో వెంకయ్య నాయుడు ఎయిమ్స్‌లో కంప్లీట్‌ బాడీ చెకప్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అప్పట్లోనే ఆయన గుండెకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. 

ఈ నేపథ్యంలోనే శుక్రవారరం ఆయన ఆస్పత్రిలో చేరారు. 

ఎయిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ బల్‌రాం భార్గవ ఆధ్వర్యంలో వెంకయ్యకు పరీక్షలు చేశారు. ''ఉప రాష్ట్రపతికి యాంజియోగ్రఫీ పరీక్ష చేశాం.

ఆయన రక్తనాళాల్లో ఒకటి సన్నబడిందని గుర్తించాం. ఈ నేపథ్యంలోనే స్టెంట్‌ వేశాం'' అని డాక్టర్లు తెలిపారు. 

ఆయనను శనివారం డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వివరించారు.

విద్యార్థి సంఘాల వినూత్న నిరసన

ఇటీవల కార్పొరేట్ కళాాశాలలోబోధన హింసాత్మకంగా మారడం, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటంతో జయవాడలో ఇంటర్మీడియట్  ఆర్ ఐఒ  కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు వినూత్న ఆందోళన చేపట్టాయి. మెడకు ఉరి తాడు వేసుకుని ఈ మధ్య జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల వాతావరణాన్ని ప్రజల దృష్టికి తీసువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ, పిడిఎస్ యు, వైసిపి విద్యార్థి సంఘం  సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలని,విద్యార్థుల ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా ఈ మధ్య ఆత్మహత్యులు జరుగుతున్న కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.