న్యూఢిల్లీ: దేశీయ వాణిజ్య వాహనాల దిగ్గజం ‘అశోక్ లేలాండ్’ విదేశాల్లో భారీగా విస్తరణ ప్రత్యేకించి పలు అసెంబ్లింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రణాళికలను రూపొందించింది. ప్రత్యేకించి సీఐఎస్ రీజియన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో కార్యకలాపాల నిర్వహణకు చర్యలు రూపొందించామని తెలిపింది. నూతన శ్రేణి మధ్య, భారీ తరహా వాణిజ్య, తేలికపాటి వాణిజ్య వాహనాలను నూతన ప్రాంతాలకు విస్తరించ తలపెట్టినట్లు పేర్కొంది. 

సంప్రదాయంగా శక్తిమంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్, సార్క్ సభ్య దేశాల తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించాలని హిందూజాల సారథ్యంలోని అశోక్ లేలాండ్ కంపెనీ తలపెట్టింది. న్యూ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసిన అశోక్ లేలాండ్ ఫ్యూచర్ మీడియం, హెవీ ప్రొడక్ట్స్‌ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నది. 

ఆయా పథకాల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయాలని హిందూజాల సారథ్యంలోని అశోక్ లేలాండ్ పేర్కొంది. లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్స్ కోసం స్పెషల్ ప్లాట్ ఫామ్ రూపొందించేందుకు క్రుషి చేస్తోంది. నూతన తరం ఉత్పత్తులు వచ్చే ఏడాది విపణిలోకి ప్రవేశించనున్నాయి. 

అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజ స్పందిస్తూ కొన్ని మార్కెట్ల పరిధిలో ఉన్న డిమాండ్, అమ్ముడవుతున్న వాల్యూమ్స్ వల్ల ఆయా ప్రాంతాల్లో భారీ స్థాయిలో మాన్యూఫాక్చరింగ్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఆఫ్రికా ఖండంలోని కెన్యా, ఐవోరీ కోస్ట్ వంటి దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ధీరజ్ హిందూజా పేర్కొన్నారు. కొన్ని సీఐఎస్ దేశాలపైన ద్రుష్టి పెట్టామన్నారు. ఆయా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలతో జాయింట్ వెంచర్, పార్టనర్ షిప్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో నూతన శ్రేణి ఉత్పత్తులతో గ్రోథ్ సాధించాలని, శక్తిమంతంగా తయారు కావాలన్నదే తమ లక్ష్యమని ధీరజ్ హిందూజా పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాలకు 10-12 శాతం ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏషియాన్ మార్కెట్లోకి అడుగు పెట్టాలని తమ లక్ష్యాల్లో ఒకటన్నారు. 

ప్రస్తుతం అశోక్ లేలాండ్ తొమ్మిది దేశాల్లో ఉత్పాదక కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బంగ్లాదేశ్, శ్రీలంక, నైజీరియా, బ్రిటన్ దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. అంతర్జాతీయంగా ట్రక్ మార్కెట్లలోటాప్ టెన్, బస్సుల్లో టాప్ 5లో అశోక్ లేలాండ్ ఒకటిగా ఉన్నది.