తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో యమహా కొత్త బైక్‌లు లాంచ్
Yamaha launches XSR155: యమహా భారత మార్కెట్‌లో కొత్త బైక్‌లు లాంచ్ చేసింది. సూపర్ ఫీచర్లతో XSR155, FZ రేవ్ లతో పాటు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు Aerox-E, EC-06లను విడుదల చేసింది. వీటి ధరలు ₹1.17 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

యమహా కొత్త బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా మోటార్ ఇండియా తన కొత్త బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో 2025 సంవత్సరానికి పెద్ద అడుగుగా నాలుగు కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. వీటిలో XSR155, FZ రేవ్, Aerox-E, EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఈ లాంచ్‌తో యమహా సంప్రదాయ ఇంధన బైక్‌లతో పాటు ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనూ తన దృష్టిని కేంద్రీకరించింది.
రేట్రో లుక్‌తో యమహా XSR155 లో ఆధునిక ఫీచర్లు
యమహా XSR155 బైక్ భారత్‌లో ₹1,49,990 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదలైంది. MT-15, R15 ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి ఈ బైక్ రూపొందించారు. 155cc లిక్విడ్-కూల్డ్, నాలుగు వాల్వ్ ఇంజిన్‌తో ఇది 18.4PS పవర్, 14.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్-స్లిప్పర్ క్లచ్ కలిగి ఉంది.
డెల్టాబాక్స్ ఫ్రేమ్, అప్‌సైడ్‌డౌన్ ఫోర్కులు, మోనోషాక్ సస్పెన్షన్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వంటి అధునాతన సాంకేతికతలతో బైక్‌ను మరింత స్థిరంగా, తేలికగా రూపొందించారు. డ్యూయల్ ఛానెల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
రౌండ్ LED హెడ్‌ల్యాంప్, టీర్డ్రాప్ ట్యాంక్, సింపుల్ LCD క్లస్టర్‌తో రేట్రో లుక్‌ను కలిగి ఉంది. నాలుగు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మెటాలిక్ బ్లూ, గ్రేయిష్ గ్రీన్, వివిడ్ రెడ్, మెటాలిక్ సిల్వర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా స్క్రాంబ్లర్, కేఫే రేసర్ యాక్సెసరీ కిట్లు కూడా ఉన్నాయి.
స్టైలిష్ అప్‌డేట్ తో యమహా FZ రేవ్
యమహా మరో కొత్త మోడల్ FZ రేవ్‌ను ₹1,17,218 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ధరతో తీసుకొచ్చింది. ఇది యమహా ప్రముఖ FZ కుటుంబానికి చెందిన తాజా అప్‌డేట్. 149cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 12hp పవర్, 13.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్కులు, రియర్‌లో మోనోషాక్ సస్పెన్షన్ కలిగిన ఈ బైక్‌లో రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 17 అంగుళాల వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. మ్యాట్ టైటాన్, మెటాలిక్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. LED హెడ్‌ల్యాంప్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ పీస్ సీట్ వంటి ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
Aerox-E, EC-06 లతో ఎలక్ట్రిక్ విభాగంలోకి యమహా ఎంట్రీ
యమహా Aerox-E, EC-06 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా లాంచ్ చేసింది. వీటి ధరలను 2026 తొలి త్రైమాసికంలో ప్రకటించనుంది. EC-06 స్కూటర్ 4kWh బ్యాటరీతో 160km రేంజ్ ఇస్తుంది. 6.7kW మోటార్, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్ కలిగి ఉంది. 24.5 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ సామర్థ్యం ఉండటంతో నగరాల్లో వాడకానికి అనుకూలంగా ఉంటుంది.
Aerox-E స్కూటర్ రెండు 3kWh రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఇది 9.4kW పీక్ పవర్, 46Nm టార్క్ ఇస్తుంది. ఎకో, స్టాండర్డ్, పవర్, బూస్ట్ మోడ్‌లతో ఇది స్పోర్టీ అప్షన్లను కలిగి ఉంది. 106km రేంజ్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, సింగిల్ ఛానెల్ ABS, TFT కాన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
యమహా కొత్త వ్యూహం
ఈ లాంచ్‌లతో యమహా భారత మార్కెట్‌లో తన ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తోంది. XSR155 ద్వారా హేరిటేజ్ లుక్, FZ రేవ్ ద్వారా మాస్ మార్కెట్ పై పట్టు, Aerox-E, EC-06 ద్వారా ఎలక్ట్రిక్ భవిష్యత్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వ్యూహం ద్వారా యమహా రెండు వర్గాల రైడర్లను ఆకర్షించనుంది. పెట్రోల్ ఇంజిన్ ప్రేమికులు, ఎలక్ట్రిక్ వాహనాలను ఆశించే కొత్త తరం కోసం యమహా తన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. 2025లో యమహా లైనప్ భారత ద్విచక్ర వాహన రంగంలో పోటీని మరింత పెంచింది.