కేజ్రీవాల్ ‘కారు’ దొరికింది..!

Arvind Kejriwals missing Wagon R found abandoned in Ghaziabad
Highlights

  • రెండు రోజుల క్రితం చోరీకి గురైన కేజ్రీవాల్ కారు
  • ఘాజియాబాద్ లో కారును గుర్తించిన పోలీసులు
  • ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్

దిల్లీ సీఎం కేజ్రీవాల్ ‘ బ్లూ వ్యాగనార్’ కారు దొరికింది.  రెండు రోజుల క్రితం దిల్లీ సెక్రటేరియట్ ఎదుట నిలిపిన కారును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆ కారును ఘాజియాబాద్ లో శనివారం పోలీసులు గుర్తించారు.

2013లో కుందన్ శర్మ అనే ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్‌ ఇదే కారును ఉపయోగించారు. అయితే గత రెండు రోజుల క్రితం చోరీకి గురైంది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కారు కోసం విస్తృతంగా గాలించారు. కాగా ఘాజియాబాద్ లోని మోహన్ నగర్ లో కారును గుర్తించారు.

అయితే ఈ ఘటనపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ విషయంపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కి లేఖ రాశారు. దిల్లీలో శాంతి భద్రతలపై ఆయనను ప్రశ్నించారు. ‘ నా కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. దిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం’ అని కేజ్రీవాల్‌ అనిల్ బైజల్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

2013లో కేజ్రీవాల్ దిల్లీ సీఎంగా ఎన్నికైన సమయంలో తొలిసారి అసెంబ్లీకి ఈ కారులోనే అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వ కారును ఇస్తామన్నా.. వద్దని ఆయన ఈ బ్లూ వ్యాగనార్  కారులోనే వచ్చారు. అంతేకాదు 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి, తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికీ ఈ కారు ప్రత్యక్ష సాక్షి.   ఇదిలా ఉంటే.. పోలీసులు పోయిన కారును కనుక్కోగలిగారు కానీ.. చోరీ చేసింది ఎవరనేది మాత్రం తెలుసుకోలేకపోయారు.

loader