ఆర్షిఖాన్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 11తో ఆమె పాపులారిటీ బాగా సంపాదించింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉండు ఆర్షి.. మరోసారి వార్తల్లో హెడ్ లైన్ గా మారింది. ఇంతకీ మ్యాటరేంటి అంటే.. ఓ సాయి ధామ్ గుడి పూజారి రమేష్ జోషి.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అనేది ఆమె వాదన. అయితే.. పూజారి మాత్రం.. ఆర్షి నా దగ్గర డబ్బులు అప్పు తీసుకుంది. తిరిగి ఇవ్వడం లేదనేది ఆయన వాదన.

 

పూజారి రమేష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్షిఖాన్..2015 సెప్టెంబర్ లో సాయిధామ్ గుడికి తొలిసారిగా వెళ్లారు. అప్పటి నుంచి ఆమె తరచుగా గుడికి వెళ్లేవారు. అయితే.. ఒక రోజు ఆర్షి.. పూజారి దగ్గరకి వచ్చి తన మొబైల్ ఫోన్, పర్స్ ఎవరో దొంగలు ఎత్తుకుపోయారని, ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. తనకు రూ.40వేలు అప్పుగా ఇవ్వమని ఆ పూజారిని కోరింది. ఎన్నో రోజులుగా ఆర్షిని గమనిస్తున్న పూజారి నిజమేనని భావించి.. ఆమెకు డబ్బులు ఇచ్చాడు. అయితే.. డబ్బు తీసుకున్న నాటి నుంచి ఆర్షి గుడికి రావడం మానేసింది. డబ్బు కోసం పూజారి ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయడం కూడా మానేసింది. తర్వాత ఒకసారి ఫోన్ చేసి త్వరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పిందట. అయినా ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో.. ఆ పూజారి పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై కేసు కూడా పెట్టాడు.

 

పూజారి కేసు పెట్టాడు అని తెలియగానే.. ఆర్షి స్పందించింది. ఆ పూజారి తనను లైగింకంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించడం మొదలుపెట్టింది. అయితే.. పూజారి మాత్రం  ఆర్షి తనకు కూతురు లాంటిదని.. తన డబ్బులు తనకు ఇప్పిస్తే చాలని వేడుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.