ఈ సారి జరగబోయే పందేలకు భీమవరంకు చెందిన కొందరు రాజులు తెలంగాణా ఐటి, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావును ఆహ్వానించటం గమనార్హం.

జనవరి నెల వస్తోందంటేనే చాలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రలందరికీ ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. జనవరి నెలకు, ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న అనుబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి ‘కోడి పందేలు’. లక్షలాది ప్రజలను ఉర్రూత లూగించేవి, కోట్ల రూపాయల్లో పందేలు కాయించే శక్తి ఉన్నది ఒక్క ‘కోడిపందేల’కే. పందేలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐ.భీమవరం, గణపవరం, జంగారెడ్డి గూడెం, ఆకీవీడు, చింతలపూడి, ఉండితో పాటు ఏలూరు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు చాలా ప్రసిద్ధి.

ఈ పందేల్లో పాల్గొనే కోళ్లకు ఏడాది పొడువునా శిక్షణ ఇప్పిస్తూనే ఉంటారు. పందేల్లో పాల్గొనే కోళ్ళు బలిష్టంగా తయారయ్యేందుకు గంటల తరబడి స్విమ్మింగ్ చేయిస్తారు. రన్నింగ్ ప్రాక్టీసు చేయిస్తారు. ప్రతీ రోజూ మసాజ్ చేస్తారు. ఎత్తు ఎగిరేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తారు. పందెం కోళ్ళను మేపటానికి నెల ఖర్చు వేలల్లో ఉంటుంది. పౌరుషం వచ్చేందుకు కారం కలిపిన బాదం పప్పులు, జీడిపప్పులు, ఇలా రకరకాల ఎంపిక చేసిన ఆహారాన్ని కోళ్ళకు బాగా తినిపిస్తారు.

ఈ పోటీల్లో పుంజులను మాత్రమే దింపుతారు. ఒక్కో పుంజును పోటీల్లో దింపేముందు వాటి గత చరిత్రను కూడా చూస్తారు. అంటే, గతంలో అవేమన్నా పోటీల్లో పాల్నొన్నాయా ? ఎన్ని పోటీల్లో పాల్గొన్నాయి? గెలుపు, ఓటమి శాతమెంత అన్న వాటిని కూడా పరిశీలిస్తారు. లేదంటే, ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేసుకుని కొత్త పెందెంకోళ్ళను తయారు చేసుకుంటారు. ఒక పుంజును రోజులో ఒక పోటీకి మాత్రమే దింపుతారు.

జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోళ్లపందేల కోలాహలం పండుగను మించి ఉంటుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ పందేలకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే కోళ్ళపందేలు నిర్వహించటమన్నా, పాల్గొనటమన్నా పెద్ద హోదాగా భావించటమే. రాజకీయ నేతలు, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఇలా అనేక రంగాల్లో ప్రముఖులంతా ఈ పందేలు జరిగే ప్రాంతాల్లో వాలిపోతారు. విదేశాలనుండి కూడా పోటీల కోసం వస్తారంటే ఆశ్చర్యమే.

పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఏకంగా వారం, పది రోజుల పాటు క్యాంపు వేస్తారు. పందేలు వందల కోట్ల రూపాయల్లో ఉంటాయి. పందేలు కాసేవారు డబ్బును లెక్కపెట్టుకునేందుకు ఏకంగా కౌటింగ్ మిషన్లు ఉపయోగిస్తారంటేనే పందేలు ఏ స్ధాయిలో జరుగుతాయో అర్ధం చేసుకోవచ్చు. పోటీల నిర్వహణ ఎక్కువగా క్షత్రియ సామాజిక వర్గం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ సారి జరగబోయే పందేలకు భీమవరంకు చెందిన కొందరు రాజులు తెలంగాణా ఐటి, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావును ఆహ్వానించటం గమనార్హం.

కోళ్లపందేల నిర్వహణ చట్ట విరుద్ధమని, సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నాయంటూ ఓ కేసు న్యాయస్ధానంలో విచారణలో ఉన్నది. అయితే, కోళ్లపందేలన్నది దశాబ్దాల తరబడి ఓ సంప్రదాయంగా వస్తున్న క్రీడగా పలువురు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఈ పందేలను జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడలేదు.