ఐఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న రోజు రానే వచ్చింది. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ మూడు సరికొత్త ఐఫోన్ మోడల్స్ ని విడుదల చేసింది

ఐఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న రోజు రానే వచ్చింది. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ మూడు సరికొత్త ఐఫోన్ మోడల్స్ ని విడుదల చేసింది. యాపిల్ కంపెనీ ఐఫోన్ ని విడుదల చేయడం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఐఫోన్ 8, ఐఫోన్ 8ఫ్లస్ తోపాటు ఐఫోన్X ని కూడా విడుదల చేశారు.

 భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10గంటల సమయంలో కాలిఫోర్నియాలో యాపిల్ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ థియేటర్ లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఐఫోన్X ని ఆవిష్కరించారు. గతంలో వచ్చిన ఐఫోన్ లకు భిన్నంగా ఈ ఫోన్ ని విడుదల చేశారు. మొదటి ఐఫోన్ విడుదల చేసి 10 సంవత్సరాలు పూర్తయినందున అందుకు గుర్తుగా రోమన్ అంకె X (X అంటే 10) పేరిట ఐఫోన్ X ను యాపిల్ విడుదల చేసింది. అయితే ఈ ఫోన్లు సెప్టెంబర్‌ చివరి వారంలో భారత మార్కెట్లోకి రానున్నాయి. భారత్‌లో వీటి ధర, విక్రయ తేదీలను యాపిల్‌ నేడు ప్రకటించింది.

ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ ఫోన్లు సెప్టెంబర్‌ 29 నుంచి దేశవ్యాప్తంగా సంస్థ అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంటాయని యాపిల్‌ ఇండియా ప్రకటించింది. 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో ఉండే ఈ ఫోన్ల ధర రూ. 64,000 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఇక ప్రత్యేక ఫీచర్లతో విడుదల చేసిన ఐఫోన్‌ టెన్‌ నవంబర్‌ 3 నుంచి మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.89,000 నుంచి ప్రారంభం కానున్నట్లు యాపిల్‌ ప్రకటించింది..