వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పెట్టిన కుంపటి.. ఇప్పట్లో ఆరేలా లేదు. ‘ కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పేరుతో ఐలయ్య ఇటీవల పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలో పలు వివాదాలకు దారితీసింది. అయితే.. మెల్లమెల్లగా.. ఈ వివాదం ఏపీకి కూడా పాకుతున్నట్లు కనిపిస్తోంది.
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పెట్టిన కుంపటి.. ఇప్పట్లో ఆరేలా లేదు. ‘ కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పేరుతో ఐలయ్య ఇటీవల పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలో పలు వివాదాలకు దారితీసింది. అయితే.. మెల్లమెల్లగా.. ఈ వివాదం ఏపీకి కూడా పాకుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ఏపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలే నిదర్శనం. గతంలోనూ ఐలయ్యపై టీజీ ఘాటు వ్యాఖ్యలు చేయగా... తాజాగా మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు.
కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అంటూ ఐలయ్య రాసిన పుస్తక వివాదం కాస్తా ఇప్పుడు ఆర్యవైశ్యులు ద్రవిడులు అవునా కాదా అనే వివాదానికి తెరలేపింది. ఇదే విషయంలపై టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఐలయ్యకు సవాల్ విసిరారు. ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. విజయవాడలో అక్టోబర్ 28న జరగనున్న కంచ ఐలయ్య సన్మానాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అయితే.. ఈ సభకి అనుమతిని విజయవాడ నగర పోలీసులు నిరాకరించిన సంగతి బహుషా టీజీ వెంకటేష్ కి తెలిసినట్టు లేదు. అందుకే అడ్డుకోమని చెబుతున్నారు.
అంతేకాకుండా తమ సామాజిక వర్గాన్ని పదే పదే దూషిస్తే తిరగబడతామని టీజీ.. ఐలయ్యను హెచ్చరించారు.ఐలయ్య రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. కమ్యూనిస్టులు కూడా ఐలయ్య నామస్మరణ చేస్తున్నారని... వీరిలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
ఐలయ్య పుస్తకం ఏపీలో వివాదం రేపకూడదనే భావనతో.. చంద్రబాబు ఆ పుస్తకాన్ని ఏపీలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా టీజీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసేలా కనపడుతున్నాయి.
