వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబనాయుడు ఓటుబ్యాంకును విస్తరించుకుంటున్నారు. ఇందులో భాగంగానే  చంద్రన్న.. బీసీలకు తాయిలాలు అందజేస్తున్నారు. ‘చంద్రన్న పెళ్ళికానుక’ పథకం కూడా అందులో భాగమే.

వివరాల్లోకి వెళితే.. బీసీ పేద మహిళల కోసం  చంద్రన్న పెళ్లి కానుక పథకంలో భాగంగా ఈ ఏడాది ప్రభుత్వం రూ. 300కోట్లు కేటాయిస్తోంది. ఏటా లక్ష మందికి ప్రయోజనం చేకూరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.  జనవరి 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

ఈ పథకం బీసీలను ఆకట్టుకునేందకే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఇదే రకంగా పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే దళితులు, బీసీల మద్దతు చాలా అవసరం. అందులోనూ ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది బీసీలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ పెళ్లి కానుక పథకాన్ని ఎరగా వేసి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

18 ఏళ్ళు నిండిన తర్వాత వివాహం చేస్తేనే పథకం వర్తిస్తుంది. వివాహం నిశ్చయం కాగానే 20 శాతం డబ్బిస్తారు. పెళ్ళి తర్వాత మిగిలిన సొమ్మును అర్హుని బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.

నిజానికి పేదలను ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యమైతే ఇలా సామాజిక వర్గాల పేర్లతో  విడదీయనక్కర్లేదు. అన్ని సామాజిక వర్గాల్లో పేదలు ఉన్నారు. పెళ్లి చేసుకునే స్థోమత లేక సామూహిక వివాహాలు చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయవచ్చు. అలా చేయడం లేదంటేనే ‘ చందన్న’ ఉద్దేశం అర్థమౌతోంది.

ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది కాబట్టి.. చంద్రబాబు ఈ పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దళితులకు కూడా ఇలాంటి పథకం అమలు చేయడానికి రంగం సిద్ధమౌతోంది.