వైస్ చైర్మన్ అవ్వాస్ సీతారామారావు అరెస్ట్

అమాయక ప్రజలకు అధిక వడ్డీలు ఆశచూపించి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థకు గతంలో బోర్డు మెంబర్ గా పని చేసి ఈ మోసంలో కీలక పాత్ర వహించిన అవ్వాస్ సీతారామరావు డిల్లీలో ఏపి సీఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ మోసం బయటకు రాగానే
సీతారాం తాను అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పక్కా సమాచారంతో డిల్లీకి వెళ్లిన ఎపి సీఐడి పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి ఎట్టకేలకు సీతారాం ను అరెస్ట్ చేశారు. 

 ప్రస్తుతం అరెస్టైన సీతారాం 2011 వరకు అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్ గా పనిచేశారు. అయితే పథకం ప్రకారం 2011 లో బోర్డు నుండి ఇతడు తప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టైన సంస్థ చైర్మన్ అవ్వాస్ వెంటకరామారావుకు సీతారాం స్వయానా సోదరుడు.

అగ్రిగోల్డ్ మోసంలో సీతారాం కీాలకంగా వ్యవహరించాడని మోదటి నుండి పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఇతన్ని అదుపులోకి తీసుకోవాలని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టాయి. డిల్లీలో ఇతడు తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సీఐడీ పోలీసులు సీతారాం ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల్లో ఇతన్ని విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో వైస్ ఛైర్మన్ సీతారాం అరెస్టవడం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం అధ్యక్షుడు ముపాళ్ళ నాగేశ్వరరావు, తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు.