తెలంగాణ పోలీసులను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తమ వ్యక్తిగత వివాదాలతొ పోలీస్ శాఖ పరువును బజారుకీడుస్తున్న సంఘటనలు ఈ మద్య కాలంలో అనేకం జరుగుతున్నాయి.  ఉన్నత స్థాయి అధికారులతో పాటు కింది స్థాయిలోని పోలీసులు కూడా ఈ వివాదాలను కారణమవుతున్నారు. ఇలాగే తాజాగా ఒక పోలీసాఫీసర్ మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పోలీసు బాగోతం బైటకు వచ్చింది. 

వివరాల్లోకి వెళితే రాజేంద్ర నగర్‌ సీఐగా పని చేస్తున్న పుష్పన్‌ కుమార్‌  ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాలో వివాదంలో చిక్కుకున్నాడు. ఉద్యోగ రిత్యా తెలంగాణ లో పనిచేస్తున్నప్పటికి ఆయన స్వస్థలం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం. ఈయనకు విజయ తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే వ్యక్తిగత కారణాలతో పెళ్ళైన కొన్నాళ్ళకే భార్య, భర్తలు విడిపోయారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని కోర్టును ఆశ్రయించినప్పటికి కోర్టు నుండి విడాకులు ఇంకా రాలేవు.  

అయితే విడాకులు మంజూరు కాకుండానే పుష్పన్‌ కుమార్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ఇంటి ముందు ధర్నాకు దిగింది. దీంతో ఆగ్రహించిన పుష్పన్‌ కుమార్‌, అతని కుటుంబ సభ్యులు వీరిపై దాడికి దిగారు.    దీంతో విజయ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించింది.  

 విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని, విచారణ పూర్తి కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నారంటూ విజయ పుష్పన్‌ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ విజయ డిమాండ్‌ చేసింది.