కడప జిల్లాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మౌంట్ పోర్డు పాఠశాలకు చెందిన చరణ్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య మరువకముందే తాజాగా సింహాద్రిపురంలోని కస్తూర్బా హాస్టల్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ వరుస ఆత్మహత్యలతో కడప జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తాజా ఆత్మహత్య  వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో గల కస్తుర్బా పాఠశాలలో వెంకటేశ్వరి అనే విద్యార్థిని 10 వ తరగతి  చదువుతోంది. వెంకటేశ్వరి లింగాల మండలం దిగువపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి, శివలక్ష్మి దంపతుల కూతురు. వెంకటేశ్వరి చదువులో బాగా చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు.

అయితే వెంకటేశ్వరి ఇవాళ ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు పడుకుని ఉన్న సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొద్దున విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్ కు సమాచారం అందించారు. దీంతో ఆమె పోలీసులకు, తల్లిదండులకు సమాచారం అందించింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, బందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  వారికి సర్దిచెప్పిన పోలీసులు విద్యార్థిని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా... విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను గుర్తించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.