కూకట్‌పల్లిలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిన ఓ యువతిని హత్య చేసి తన పైశాచికాన్ని ప్రదర్శించాడు. ఈ సంఘటన కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట హబీబ్ నగర్ లో చోటుచేసుకుంది.   

ఈ హత్యకు సంబంధించి పోలీసులు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని గుయ్యనవలస గ్రామానికి చెందిన గోను జానకి కూకట్ పల్లిలో డీ మార్ట్ లో పని చేస్తోంది. ఈమె తన స్నేహితురాలు రూప తో కలిసి మూసాపేట హబీబ్ నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది.  అయితే జానకి పనిచేసే మార్ట్ లోనే రంగారెడ్డి జిల్లా పెద్దెముల్ మారెపట్టి గ్రామానికి చెందిన అనంతప్ప(ఆనంద్‌) అనే యువకుడు పనిచేస్తున్నాడు. అతడు గత కొంత కాలంగా జానకిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడి ప్రేమను జానకి పట్టించుకునేది కాదు. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అనంతయ్య ఈ మద్య ఆమెను మేధిరించినట్లు సమాచారం.  ఈ క్రమంలోనే మరోసారి జానకి నివసిస్తున్న ఇంటి వద్దకు వెళ్లి ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి కత్తితో పొడిచి హత్య చేశాడు. 


 ఈ దాడితో బాధితురాలు తీవ్ర గాయాలతో పడిఉండటం గమనించిన స్థానికులు కొందరు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో  మంగళవారం అర్థరాత్రి జానకి మృతిచెందింది.  ఈ దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.