బోయలను ఎస్ టి జాబితాలో చేర్చేదాకా వదిలేది లేదుంటున్న చంద్రబాబు. ఇపుడు వారు బిసిలలో ఉన్నారు. అనంతపురం కర్నూలు జిల్లాలో భారీగా వోట్ బ్యాంక్ ఉంది. వాళ్లను ఆకట్టుకునేందుకు టిడిపి వ్యూహం

ఆదిమ గిరిజన తెగ అయిన వాల్మీకి సామాజిక వర్గాన్ని గిరిజన తెగల జాబితాలో చేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. నేడు వాల్మీకీ జయంతి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఎన్నికల హామీ అని నేరవేర్చి తీరతామని ప్రకటించారు.

‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర సందర్భంగా వాల్మీకుల కష్టాలు తన కలచివేసిందని, వాళ్ల జీవితాలను దగ్గరగా చేశానని ఆయన చెప్పారు. యాభై ఏళ్లుగా ఎటువంటి సముద్ధరణకు నోచుకోని వాల్మీకుల పరిస్థితి నన్ను కలచివేసిందని చెబుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక అమలుచేసేందుకు కార్యాచరణకు ఉపక్రమించామన అన్నారు.

‘ వాల్మీకుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి సత్యపాల్ కమిటిని నియమించాం. కమిటీ తన నివేదికను సమర్పించింది . నివేదిక ఆధారంగా అధ్యయనానికి ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నేతృత్వంలోని కమిటీ వివిధ జిల్లాలలో తన పర్యటన పూర్తిచేసింది. కమిటీల సిఫారసులను కేంద్రానికి నివేదిస్తాం . కేంద్రం తదుపరి చర్య తీసుకుంటుంది,’ అని ఆయన తెలిపారు.

వాల్మీకి జయంతిని రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయించామని దీని కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 131 ని జారీ చేసిందని కూడా ఆయన అన్నారు. ‘రామాయణం నిత్య పారాయణం శుభకరం. మన ఆధ్యాత్మిక సంపద అలాంటి రామాయణ రచన చేసిన వాల్మీకి మహర్షి ధన్యజీవి,’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘రామాయణం మన కుటుంబ వ్యవస్థ విశిష్టతను చాటి చెబుతుంది. ప్రభుత్వ పరిపాలన కోసం రామాయణంలో విలువైన సూచనలున్నాయి,’ అని కూడా ఆయన అన్నారు.