ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్.. వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. కాకపోతే.. ఈ ఆఫర్ కేవలం అమేజాన్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే.. ప్రైమ్ మెంబర్స్ ఇక నుంచి ఉచితంగా మ్యూజిక్ వినొచ్చు. వీరి కోసం ప్రత్యేకంగా అమేజాన్ ప్రైమ్ మ్యూజిక్ సర్వీసుని తీసుకువచ్చింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలో అమెజాన్ ప్రైమ్ యూజర్లు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఈ ఆఫర్ ని వినియోగించుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు  కాని వారు రూ.999 చెల్లించి ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సేవలను పొందవచ్చు. అలాగే అమెజాన్ సైట్‌లో ప్రత్యేక సేల్‌లు నిర్వహించినప్పుడు ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగా సేల్ అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు అమెజాన్‌లో కొనే పలు వస్తువులకు ఉచిత డెలివరీని అందిస్తారు. 

కాగా అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లో హిందీ, ఇంగ్లిష్, పంజాబీ, త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, మ‌రాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, గుజ‌రాతీ, రాజ‌స్థానీ భాష‌ల‌కు చెందిన కొన్ని ల‌క్ష‌ల పాట‌లు అందుబాటులో ఉన్నాయి. అంత‌ర్జాతీయ ఆల్బ‌మ్స్ కూడా ల‌భిస్తున్నాయి. నచ్చిన పాటలను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.