Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో రంగల రాట్నం, 439.37 కోట్లు పెట్టుబడి

  • అమరావతిలో అతి పెద్ద జెయింట్ వీల్
  • రూ.439.37 కోట్లతో మూడు దశలలో ఏర్పాటు
  • ఇపుడు అతి పెద్ద జెయింట్ వీల్ అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో ఉంది
amaravati to have highest giant wheel

రాజధాని అమరావతికి పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఒక భారీ రంగల రాట్నం(జెయింట్ వీల్) ఏర్పాటుచేయబోతున్నారు. బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. అమరావతిలోని పర్యాటక నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటుచేస్తారు. మూడు దశలలో ప్రపంచానికే తలమానికంగా నిలిచే పర్యటక ఆకర్షణగా  దీన్ని తీర్చిదిద్దుతామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వివరించారు. 


ఇటలీకి చెందిన ఫ్యాబ్రీ గ్రూపు ఈ జెయింట్ వీల్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది. టర్కీకి చెందిన పోలీన్ వాటర్ పార్క్ జెయింట్ వీల్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని జల ఆకర్షక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది. యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కృష్ణారావు,  ఫ్యాబ్రీ గ్రూప్ అధ్యక్షుడు జియన్‌లుక ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. 

amaravati to have highest giant wheel


ప్రపంచంలో అతి పెద్ద జెయింట్ వీల్ అమెరికాలోని లాస్ వెగాస్ (ఫోటో)నగరంలో ఉంది. 167.6 మీటర్ల పొడవుతో (550 అడుగులు) ఉన్న ఈ జెయింట్ వీల్ గొప్ప పర్యాటక ఆకర్షణగా గుర్తింపుపొందింది. లాస్ వెగాస్ హై రోలర్‌తో పాటు దుబాయ్ ఐ, న్యూయార్క్ వీల్, సింగపూర్ ఫ్లయర్ వంటి ప్రఖ్యాత జెయింట్ వీల్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వీటినన్నింటినీ తలదన్నేలా ‘అమరావతి బౌద్ద చక్ర’ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సంస్థ ప్రతినిధులకు సూచించారు. తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా దీన్ని నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. తొలిదశలో రూ.26.67 కోట్లు, రెండవ దశలో రూ.16.67 కోట్లు, మూడవ దశలో మరో రూ.16.67 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించారు. 
‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి ముఖ్యమంత్రి ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు,  కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. అమరావతి నవ నగరాలలో ఒకటైన పర్యాటక నగరంలో ముందు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని, ఆసక్తి గల సంస్థలను సంప్రదించి పారదర్శక పద్దతిలో టెండర్ల ప్రక్రియను నిర్వహించి అన్ని అర్హతలు ఉన్న సంస్థను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర పర్యటక శాఖ కార్యదర్శి మీనా, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios