అనంతపురం – అమరావతి 'నేషనల్ ఎక్స్ ప్రెస్ వే ' దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఒక అరుదయిన గుర్తింపు నిచ్చింది.
అమరావతి-అనంతపురం లను కలుపుతూ నిర్మించాలనుకుంటున్న రహదారికి జాతీయ హోదా ప్రకటించింది.
దీనిని కేంద్రం ’నేషనల్ ఎక్స్ప్రెస్ వే‘ గా గుర్తించింది.
ఇది కేంద్రం ప్రకటించిన మూడో నేషనల్ ఎక్స్ప్రెస్ వే.మిగతా రెండు :1. ఢిల్లీ-ఘాజియా బాద్ (135 కిమీ), 2. అహ్మదాబాద్- వాదోదర ( 91 కిమీ).
ఈ లెక్కన అనంతపురం – అమరావతి ’నేషనల్ ఎక్స్ ప్రెస్ వే’ దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే అవుతుంది. ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపారు.
ఇప్పటి దాకా దేశంలో రెండే రెండు నేషనల్ ఎక్స్రపెస్ లు ఉన్నాయి. ఒకటి గుజరాత్ లో రెండోది దేశరాజధాని ఢిల్లీ.
మొత్తం 393.59 కి.మీ. పొడవుండే అమరావతి-అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వేను 4, 6 లైన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 185.4 కి.మీ పొడవున నాలుగు వరుసలుగా, 208.19 కి.మీ. పొడవున ఆరు వరుసలుగా నిర్మిస్తారు. సుమారు పది కి.మీ. పొడవయిన సొరంగ మార్గం తవ్వడంతో పాటు, అనేక చోట్ల బ్రిడ్జిలు కూడా నిర్మించాల్సి వుంటుంది. ఈ రహదారి నిర్మాణానికి రూ. 18,103 కోట్ల వ్యయం కానుందని తెలిపారు.
కర్నూలు నుంచి అమరావతి-అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వేను కలుపుతూ ఒక ఫీడర్ రోడ్డు నిర్మించేందుకు మూడు ప్రతిపాదనలను, కడప నుంచి అనుసంధానించేందుకు రెండు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి పరిశీలనకు సమర్పించారు. ఇందులో కర్నూలు నుంచి నన్నూరు, భాగ్యనగర్ మీదుగా 75.60 కి.మీ. పొడవున, అటు కడప నుంచి కుమ్మరకొట్టాలు, ఎడవల్లి మీదుగా 88 కి.మీ. పొడవున నేషనల్ ఎక్స్ప్రెస్ వేతో కలిసేలా రూపొందించిన మార్గానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
ఈ సమావేశంలో చర్చకు వచ్చిన మరిన్ని రోడ్ల వివరాలు
విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర తలపెట్టిన ఫ్లయ్ఓవర్కు సంబంధించి డిజైన్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. నగరానికి మరింత వన్నె వచ్చేలా బెంజ్ సర్కిల్ ఫ్లయ్ఓవర్ను సుందరంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఫ్లయ్ ఓవర్ల నిర్మాణంలో అనుభవం వున్న కన్సల్టెంట్ను నియమించుకోవాలని చెప్పారు. జులై 2018 నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లయ్ఓవర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విజయవాడ-మచిలీపట్నం మధ్య మొత్తం 64.6 కి.మీ పొడవున నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు రూ. 740.70 కోట్లు వ్యయం కానుందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు. మొత్తం ప్రాజెక్టులో నాలుగు మేజర్ బ్రిడ్జిలు, ఐదు మైనర్ బ్రిడ్జిలు, ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇంకా కల్వర్టులు నిర్మిస్తున్నామని అన్నారు.
విశాఖ-భీమిలి, భోగాపురం-భీమిలి మధ్య నిర్మించే బీచ్ రహదారులను జాతీయ రహదారితో అనుసంధానించడం ద్వారా ‘సౌందర్యమాల’ సాకారమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. బీచ్ రహదారులతో పర్యాటకరంగం వృద్ధి చెందుతుందని, సైకిల్ ట్రాక్, వాక్ వే కూడా వాటికి సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు.
సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్రా దావ్రా, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి పాల్గొన్నారు.
