తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హిమాయత్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ. 2కోట్ల రుణం పొందారు

కొంత కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతన్న ఓ సినీ నిర్మాత ఎట్టకేలకు ఈరోజు పోలీసులకు చిక్కారు.ఈయన నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీకొట్టించి కోట్లాదిరూపాయల రుణం తీసుకొన్నాడని సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. రుణం చెల్లించకుండా పోలీసులకు చిక్కకుండా పారిపోయాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ బషీద్‌ (42) సినిమాపై మోజుతో చదువు మధ్యలోనే ఆపాడు. సినీ విభాగాల్లో శిక్షణ పొంది హైదరాబాద్‌ చేరాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అల్లరే అల్లరి, మెంటల్‌పోలీస్‌, నోటుకు పోటు సినిమాలతో ఫిలింనగర్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. బషీద్.. విమల్‌ గోయల్‌ అనే మరో వ్యక్తితో కలిసి జి.ఎం.జువెలర్స్‌ వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు చెప్పి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హిమాయత్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ. 2కోట్ల రుణం పొందారు. దీనికి ష్యూరిటీగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 7లో ఉన్న విలువైన భూమిని తనఖా ఉంచారు.

ఆ ఆస్తి హైమావతి అనే మహిళ పేరిట ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా జూబ్లీహిల్స్‌ సిండికేట్‌ బ్యాంకులో షేక్‌పేట్‌ ప్రాంతంలోని ఇంటిని గ్యారంటీగా ఉంచి బజ్జు ఎర్త్‌ మూవర్స్‌ పేరిట రూ.65లక్షలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. హెచ్‌ఎస్‌బీసీలో రూ.70లక్షలు, పంజాబ్‌ నేషన్‌ల్‌ బ్యాంకులో రూ.70లక్షలు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ద్వారా రూ.35లక్షలు వేర్వేరుగా రుణాలు పొందాడు. అనంతరం విలువైన ఆస్తులన్నీ వేరేవారి పేరుతో ఉన్నట్లు గుర్తించిన ఆయా బ్యాంకుల నిర్వాహకులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవలే గోయల్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బషీద్‌ను అరెస్ట్‌ చేసి జుడిషియల్‌ రిమాండ్‌కు పంపారు. సినీ నిర్మాత బషీద్‌పై ఏపీ, కర్ణాటక, హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్స్‌లో పాత కేసులున్నాయి. రెండు కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.