జియో పోటీని తట్టుకోవడానికి ఇప్పటికీ పలు టెలికాం సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. జియోకు దీటుగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జియో వల్ల బాగా ప్రభావితమైన ఎయిర్‌టెల్ ఇప్పుడు వరుసబెట్టి ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో ఆఫర్ ని తీసుకువచ్చింది. ఇది 3జీ, 4జీ యూజర్ల కోసం తీసుకువచ్చిన లాంగ్ టర్మ్ ప్లాన్. కేవలం రూ.995 తో రీఛార్జ్ చేసుకుంటే  ఆరు నెలల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ , రోమింగ్‌ కాల్స్‌ , రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1 జీబీ డేటా లభిస్తాయి. అంటే మొత్తంగా 180 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 180జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన ఈ ప్లాన్‌, రిలయన్స్‌ జియో రూ.999 ప్లాన్‌కు గట్టి పోటీగా ఉంది. 

రిలయన్స్‌ జియో తన రూ.999 ప్లాన్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను , రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను, రోజువారీ ఎలాంటి పరిమితులు లేకుండా 60జీబీ డేటాను 90 రోజులు మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. అంటే జియో అందించే ప్రయోజనాల కంటే కూడా ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు అందించే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి. ఢిల్లీ,  తెలంగాణ, తమిళనాడు, ఇతర టెలికాం సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.995 ప్లాన్‌ అందుబాటులో ఉంది.