ప్రస్తుత కాలంలో రూపాయికి కనీసం ఒక చాక్లెట్ కూడా దొరకడం లేదు. అలాంటిది రూపాయితో విమానంలో ఎలా ప్రయాణం చేస్తారు? ఇదే కదా మీ సందేహం. మీరు చదివింది నిజమేనండి కేవలం ఒక రూపాయితో విమాన టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చు. డొమెస్టిక్ ఎయిర్ లైన్ ‘‘ఎయిర్ డెక్కన్’’ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. కాకపోతే కండిషన్స్ అప్లై అంటోంది.

అసలు విషయం ఏమిటంటే.. అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందించేందుకు గోపీనాథ్ అనే వ్యక్తి  2003లో ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్ లైన్ ని ప్రారంభించారు. తర్వాత 2008లో ఈ ఎయిర్ లైన్ ని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తో విలీనం చేశారు. కాలక్రమంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో డెక్కన్ ఎయిర్ లైన్స్ పూర్తిగా సర్వీసులను రద్దు చేసింది. కాగా.. ఇప్పుడు తిరిగి మళ్లీ ఈ ఎయిర్ లైన్  సర్వీసులను ప్రారంభించనుందట. ఈ నెలాఖరులో ముంబయి, ఢిల్లీ, కోల్ కత్తాలో సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు గోపీనాథ్ తెలిపారు.

డిసెంబర్‌ 22న ముంబయి నుంచి నాసిక్‌కు తొలి ఎయిర్‌డెక్కన్‌ విమానం నడపనున్నారట. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్‌ కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేయనున్నారట. అంతేగాక.. ప్రారంభ రోజుల్లో కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్‌ అందించనున్నట్లు గోపినాథ్‌ తెలిపారు. జనవరి చివరి వరకు మిగతా మూడుచోట్ల కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.