Asianet News TeluguAsianet News Telugu

అయోమయంలో.. ఇంజినీరింగ్ కళాశాలలు..!

  • అసలే విద్యార్థులు కాలేజీలో చేరడం లేదే అని బాధపడుతున్న యాజమాన్యాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తీసుకున్న నిర్ణయం  మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మారింది.
  • రాష్ట్రంలో 30శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్యను తేల్చేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది
AICTE To Shut Down Technical Colleges With Less Than 30 percent Admissions

 

‘ఇంజినీరింగ్ విద్య’కి ఒకప్పుడు చాలా విలువ ఉండేది. చాలా తక్కువ మంది మాత్రమే.. ఇంజినీరింగ్  చేసేవారు. కాలం మారింది.. తర్వాత ఎక్కడ చూసినా ఇంజినీరింగ్ కళశాలలే.. దీంతో ఈ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. 10 సంవత్సరాల క్రితం.. ఈ ఇంజినీరింగ్ కాలేజీలన్నీ.. విద్యార్థులతో కలకలలాడాయి. మొన్న మొన్నటి దాకా కూడా  కొన్ని కాలాజీల్లో.. విద్యార్థులకు సీటు దొరికేది కాదు. కొందరైతే ఏకంగా రూ.లక్షలు డొనేషన్లు కట్టి సీటు సంపాదించే వారు. ఒక్కో బ్రాంచ్ కి 120 మంది విద్యార్థులు ఉండే వారు. అంత డిమాండ్ ఉండేది. మరి ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్ లో 30 మంది విద్యార్థులను నింపడం కూడా కష్టంగా మారింది కళశాల యాజమాన్యానికి.

అసలే విద్యార్థులు కాలేజీలో చేరడం లేదే అని బాధపడుతున్న యాజమాన్యాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తీసుకున్న నిర్ణయం  మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మారింది. కళాశాలలో 30శాతం విద్యార్థులు చేరకపోతే.. ఆ కాలాజీ గుర్తింపును రద్దు చేస్తామని  ఏఐసీటీఈ తాజాగా ప్రకటించింది.

అయితే బ్రాంచీల వారీగా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే ఏదైనా బ్రాంచీలో గుర్తింపు పొందిన సీట్లలో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకుంటే.. ఆ బ్రాంచీకి అనుమతి రద్దవుతుంది.

 

ఈ మేరకు ప్రతి కాలేజీలో బ్రాంచీల వారీగా వివరాలను తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టేలా ఏఐసీటీఈ త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఏఐసీటీఈ ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల్లోని కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామని పేర్కొంది. ఇక కాలేజీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైనా ఆ భేటీలో చర్చించింది.

రాష్ట్రంలో 30శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్యను తేల్చేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల తీరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్‌–డి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 22 బ్రాంచీలు పూర్తిగా నిండిపోగా.. 9 బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. కాలేజీల వారీగా చూస్తే.. 91 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 12 కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు చేరగా.. తొమ్మిది కాలేజీల్లో సింగిల్‌ డిజిట్‌లోనే చేశారు. అంటే ఈ 21 కాలేజీలతోపాటు మరో 30 నుంచి 40 కాలేజీల్లో 30 శాతంలోపే సీట్లు నిండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కలు తేల్చాక ఏఐసీటీఈకి నివేదించే అవకాశముంది. మరోవైపు పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశమున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇక డిగ్రీలో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కోర్సులను కొనసాగించవద్దని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీనిపై అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. 25శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల వివరాలను సేకరించి.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆయా కాలేజీల్లో ఆ కోర్సు ప్రవేశాలను కొనసాగించవద్దని స్పష్టం చేసింది. సదరు కాలేజీలు/కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని.. ఈ విషయంలో యూనివర్సిటీలు వచ్చే నెల 4వ తేదీ తరువాత చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. వచ్చే నెల 4వ తేదీ నాటికి నాలుగో దశ సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికలు పూర్తికానున్నాయి. దాంతో 25 శాతంలోపు విద్యార్థులున్న కాలేజీల లెక్క తేలనుంది. తర్వాత వాటిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios