అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ( చిన్నమ్మ)కు మరోసారి చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్ ను బహిష్కరించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దినకరన్  ఆధీనంలో నడుస్తున్న అన్నాడీఎంకేకు చెందిన జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను పార్టీ నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం నమదు ఎంజీఆర్‌ పత్రిక జయ పబ్లికేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనికి శశికళ యజమానిగా ఉన్నారు. జయ టీవీని మ్యాజిక్‌. కామ్‌ నిర్వహిస్తోంది.

 

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత అనారోగ్యకారణాలతో ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ.. ఇటీవలే మళ్లీ కలిసిపోయింది. కాగా ఇది శశికళ మేనల్లుడు  దినకరన్ కు నచ్చలేదు.  దీంతో పార్టీ ఉపప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు అన్నాడీఎంకే నేతలను తమ పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశమైన అన్నాడీఎంకే పార్టీ.. శశికళ, దినకరన్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్నాడీఎంకే ఎంపీ ముతుకరప్పన్‌ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. ‘శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచితొలగించాం. ఇకపై పార్టీ తరఫున దినకరన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదు. పార్టీ నియమాల ప్రకారం.. దినకరన్‌ నియామకం జరగలేదు. అంతేగాక, ఆయన నియామకాన్ని ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించలేదు’ అని తెలిపారు