Asianet News TeluguAsianet News Telugu

29 సంవత్సరాల తర్వాత రిలీజవుతున్న చిత్రం....

  • అలనాటి తారలు నజీరుద్దీన్ షా, షాబానా అజ్మీలు ప్రధాన పాత్రలు పోషించారు
  • 1988లో తీసిన చిత్రాన్ని ఈ ఏడాది  థియేటర్ లో విడుదల చేయనున్నారు
After 29 years Gulzars unreleased film Libaas to hit theatres later this year

సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే.. కొద్ది రోజులకో.. నెలకో.. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అయితే.. ఓ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 సంవత్సరాల కాలం పట్టింది.

. ఆ సినిమా దర్శకుడు ఎవరు.. విడుదల ఎందుకు ఆలస్యమైంది.. ఆ చిత్ర విశేషాలలోకి వెళితే..

ప్రముఖ రచయిత గుల్జార్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన ‘లిబాస్’ చిత్రాన్ని 1988లో చిత్రీకరించారు. కానీ.. ఈ చిత్రం అప్పుడు విడుదలకు నోచుకోలేదు. ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఆర్కివ్స్ లోనే ఈ చిత్రం మరుగున పడిపోయింది. కాగా..గుల్జార్ 83వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. జీ క్లాసిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో అలనాటి తారలు నజీరుద్దీన్ షా, షాబానా అజ్మీలు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్ డైరెక్టర్ పాత్రలో నజీరుద్దీన్, ఆయన భార్య, నటి పాత్రలో షాబానా లు నటించారు. వీరిద్దరి జీవితానికి సంబంధించినదే ‘ లిబాస్’ చిత్రం. ఈ సినిమాలో రాజ్ బబ్బర్, సుష్మా సేథ్, ఉత్పల్ దత్, అన్ను కపూర్, సవితా బజాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సంగీతం.. ఆర్ డీ బర్మన్( గుల్జార్ సినిమాల్లో ఎక్కవ శాతం సంగీతం అందించిన వ్యక్తి) అందించారు. వికాస్ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారులు అముల్ వికాస్ మోహన్, అన్షుల్ వికాస్ మోహన్ లు ఇప్పుడు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా అముల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కొన్ని కారణాల కారణంగా.. అప్పట్లో ఈ సినిమా విడుదల చేయడం కుదరలేదని చెప్పారు.తన తండ్రి కోరిక ఇప్పుడు నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది చివరికి ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తామని.. మరికొద్ది రోజుల్లో విడుదల తేదీ ప్రకటిస్తామని అముల్ మీడియాకు తెలిపారు.

జీ స్టూడియో  ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. 2014 నవంబర్ 22న గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.  1992లో బెంగళూరులో నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

గుల్జార్.. ‘ పరిచయ్’, ‘ ఆంది’, ‘ మౌసమ్’, అంగూర్, లేకిన్, మాచిస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.  రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను అనువదించడానికి ఆయన దర్శకత్వాన్ని వదిలిపెట్టారు. కానీ.. లిరిసిస్ట్ గా మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నారు.  ‘ స్లమ్ డాగ్ మిలీనియర్’ చిత్రానికి ఆయన  రాసిన ‘ జయ హో’ పాటకు  ఆస్కార్ అవార్డు వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios