అలనాటి అందాల తార శ్రీదేవి... ఇక లేరు అన్న విషయం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దుబాయిలోని ఒక హోటల్ లో ఫిబ్రవరి 24వ తేదీన ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం సాయంత్రం వరకు ఆమె మృతి పట్ల పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరకు బాత్ టబ్ లో ఊపిరాడక చనిపోయిందని తేల్చేశారు. ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే..ఆమె చనిపోయిందని తెలిసిన నాటి నుంచి శ్రీదేవి చివరి కోరిక ఇదే అంటూ.. సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి.

కూతురుకి పెళ్లి చేయాలనుకుందని, కూతురి మొదటి సినిమా చూడాలనుకుంటోందని.. ఇలాంటి వార్తలు కొన్ని వెబ్ సైట్లలో దర్శనమిచ్చాయి. కూతురు గురించి ఓ తల్లిగా ఆమె ఆలోచించడం నమ్మశక్యంగానే ఉంటుంది. కానీ.. శ్రీదేవికి ఎలాంటి సంబంధంలేని ఏపీ రాజకీయాలతో కూడా..ఆమె చివరి కోరికకు లింకు పెట్టారు.

‘‘ 2019లో చంద్రబాబుని ప్రధాన మంత్రిగా చూడటమే శ్రీదేవి కోరికగా పదేపదే చెప్పేవారని ఆమె మేనేజర్ చెప్పారు’’ అంటూ.. ఏబీఎన్ టీవీలో వచ్చినట్లుగా ఒక ఫోటో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. అంతేకాదు..‘‘ వైసీపీ అధినేత జగన్.. ఏపీ సీఎం కన్నా ఈ దేశ ప్రధానిగా చూడాలనేది శ్రీదేవి కోరికని.. ఈవిషయాన్ని బోనీ కపూర్ స్వయంగా సాక్షి తో చెప్పినట్లు సాక్షి వెబ్ సైట్లో వార్త ప్రచురితమైంది’’ అంటూ మరో ఫోటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలను చూసి అసలు శ్రీదేవికి.. ఏపీ రాజకీయాలకు ఏంటి సంబంధం అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం జగన్ అభిమానులు చంద్రబాబు గురించి, చంద్రబాబు అభిమానులు జగన్ గురించి కావాలనే ఇవి సృష్టించినట్లు తెలుస్తోంది.