ప్రజారోగ్య శాఖ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావుకు కళ్లు చెదిరేంత ఆస్తులున్నాయి. ఆయన నివాసాల మీద, బంధువుల ఇళ్ల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు దాడులు చేసి, ఆయన కూడ బెట్టిన ఆస్తులు చూసి అవాక్కయ్యారు. ఇంత పెద్ద అక్రమార్జన కేసు ఎసిబి చరిత్రలో ఇదే మొదటిదని అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్టణంలో ప్రజారోగ్య శాఖ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు ఇంటిలో కళ్లు చెదిరేంత ఆస్తికనపించింది. ఆయన నివాసాల మీద, బంధువుల ఇళ్ల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు దాడు చేసిన సంగతి తెలిసిందే.
అతగాడి ఆస్తుల విలువ రూ. 500 కోట్ల దాకా ఉంటుందని అంచనా.
ఒక ఇంజనీర్ కు ఇంత అస్తి ఉండటం, అది ఎసిబి అధికారుల సోదాలో వెల్లడి కావడంతో అసలు ఎసిబి చరిత్రలోనే ఇది పెద్ద కేసయిపోయిందని ఎసిబి చీఫ్ ఠాకూర్ తెలిపారు.
పాండురంగారావు ఆక్రమ సామ్రాజ్యం ఆరు జిల్లాల దాకా విస్తరించి ఉంది. విశాఖ పట్టణంలో అశ్విని ఆసుపత్రి నిర్మాణం రూ.8 కోట్ల పెట్టుబడి, 44 ఫ్లాట్లు (విశాఖలోనే 20 ఫ్లాట్లు), హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఎకరం భూమి, పలు చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ లు, 8 బ్యాంకుల్లో లాకర్లు ఎసిబి అధికారుల కంటబడ్డాయని ఆయన చెప్పారు.
పాండురంగారావు ఇంట్లో రూ.9 లక్షల నగదు, కిలో బంగారం, 10 కిలోల వెండి నగలు, భారీగా అమెరికన్ డాలర్లు, రద్దయిన రూ.500 నోట్ల కట్టలు కూడా దొరికాయని అయన చెప్పారు.
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం, కొడుకు సుధీర్ పేరుపై సోలార్ పవర్ సునీల్ ఎంటర్ ప్రైజెస్ లో రూ.66 లక్షల పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించామనిఆయన చెప్పారు.
ఇదే విధంగా ఆంధ్రావిశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ విజయకుమార్ కూడా విపరీతంగా అక్రమార్జన ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ప్రొఫెసర్ స్థిరాస్తుల డాక్యుమెంట్ విలువ రూ. 3.58 కోట్లు ఉంటుందని ఆదాయానికి మించి రూ.2.06 కోట్ల ఆస్తులున్నాయని ఆయన చెప్పారు. పాండురంగారావు, విజయకుమార్ ఇద్దరు కలసి వ్యాపారం కూడా చేస్తున్నారు. మూడు నెలల పాటు నిఘా వేసి, సమాచారం సేకరించి ఈ దాడులు జరిపినట్లు డిజి ఠాకూర్ తిరుపతిలో తెలిపారు.
