ఆధార్ కార్డు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మొదటి వివాహం గురించి దాచి రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆధార్ కార్డు బైటపెట్టింది. తన గుట్టు బైటపడటంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. హిందూపురం పట్టణంలో నివాసముండే చింతలపూడి తిరుపతినాయుడు రహమత్‌పురంలోని ఫైనాన్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఈ ఏడాది జూన్‌ 16న ఉయ్యూరుకు చెందిన దుర్గాభవానితో వివాహమైంది. అయితే అతడు మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ఈ వివాహాన్ని చేసుకొన్నాడు. అయితే ఇతడి మెదటిపెళ్లి విషయాన్ని ఆదార్ కార్డు బట్టబయలు చేసింది.

విధుల్లో బాగంగా ఆఫీసుకు వెళ్ళిన తిరుపతి నాయుడు చెక్‌బుక్ ఇంట్లోనే మరిచిపోయాడు. దీని కోసం భార్య భవానికి ఫోన్ చేశాడు. ఆమె ఈ చెక్ బుక్ ను వెతుకుతుండగా  ఓ ఆదార్ కార్డు కనిపించింది. దాన్ని పరిశీలించిన భవానికి అసలు విషయం తెలిసింది.  ప్రసన్నలక్ష్మి అనే మహిళకు చెందిన ఆ ఆధార్ కార్డులో తన భర్త  తిరుపతినాయుడి పేరు ఉండటాన్ని గమనించింది. దీంతో భర్త ఇంటికి రాగానే ఈ విషయంపై భర్తను నిలదీసింది. దీంతో అసలు విషయం బైటపడిందని గ్రహించిన తిరుతినాయుడు కాసేపట్లో వస్తానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

అలా వెళ్లిపోయిన భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భవాని బంధువులకు సమాచారాన్ని ఇచ్చింది. వీరంతా కలిసి అతడు పనిచేసే ఆఫీసుకెళ్లి చూడగా అతడి శవం కనిపించింది. భార్యకు తన మొదటి పెళ్లి గురించి తెలియడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మొదటి పెళ్లి వ్యవహారం బైటపడి అందరిలో తన పరువు పోతుందని భావించి అతడు ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానిక సీఐ తెలిపారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.