బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ ఆఖరి రోజుగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బ్యాంకు అనుసంధానానికి తుది గడుపును పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

 ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు గురువారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును పొడగిస్తున్నట్లు చెప్పింది. ఈ తుది గడువును మార్చి 31,2018కి మార్చినట్లు తెలిపింది.

2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం ప్రకారం 2017 జూన్ 1 తర్వాత బ్యాంక్ ఖాతాలు తెరచిన వాళ్లు.. 6నెలల్లోగా లేదా గడువు తేదీ లోగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, పాన్ నెంబర్, ఫామ్ 60 అందజేయాలని సూచించింది. కాగా.. మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6తో ముగుస్తుందని తెలిపింది.