కాలు కూడా మోప లేని కాంపిటేషన్ లోకి ఒక మహిళ సాహస యాత్ర

a women started cab  service with electric vehicles
Highlights

  • ఉద్యోగం లో సాధించిన అనుభవానికి ఏమాత్రం పొంతన లేని వ్యాపార రంగంలో తొలి అడుగులు వేసింది
  •   లాభాపేక్ష  ఒక్కటే  ప్రధానంగా  ఎంచుకుండా  సామాజిక  దృక్పథంతో  పర్యావరణ హితానికీ  పెద్దపీట


సాహసి కాని వాడు జీవన సమరానికి పనికిరాడు అని ఒక కవి చెప్పాడు. ఉన్నచోటే ఉండిపోతే మనిషి మోడై పోతాడు. కాళ్లకుకదలిక నేర్పాలి, ఆలోచలకు కళ్లెం తెంపాలి. సమరానికి సన్నద్ధం కావాలి. సరిగ్గా శ్రతి ఇలాగే చేసింది. ఉన్న ఉద్యోగం వదిలేసి సాహసంతో టఫ్ కాంపిటీషన్ ఉన్నఫీల్డ్ లోకి చొరబడుతూఉంది. 
చదివిన చదువుకు, ఉద్యోగం లో సాధించిన అనుభవానికి ఏమాత్రం పొంతన లేని వ్యాపార రంగంలో తొలి అడుగులు వేసింది  శ్రుతి.   లాభాపేక్ష  ఒక్కటే  ప్రధానంగా  ఎంచుకుండా  సామాజిక  దృక్పథంతో  పర్యావరణ హితానికీ  పెద్దపీట వేస్తున్న ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే..

హాయ్.. నా పేరు శ్రుతి . మాదో చిన్న కుటుంబం. నాన్న .. వ్యాపారంలో స్థిరపడ్డారు. అమ్మ  గృహిణి, నాకో అన్నయ్య  ఐటీ రంగంలో స్థిరపడ్డాడు. నేను బయోకెమిస్ట్రీలో పీజీ చేశాను. చదువు పూర్తవగానే ఎన్ఐఎన్ సంస్థలో చేరాను. 
ఇంద్రా నూయి,  కిరణ్ మజుందార్ షాలు  నాకు ఆదర్శం.  మొదట్నుంచీ  వ్యాపార రంగమంటే నాకు చాలా ఆసక్తి.  అదే నన్ను ఉద్యోగ జీవితం నుంచి బయటకు వచ్చేలా చేసింది.  కానీ, నేను చేసే వ్యాపారం పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదనేది నా కోరిక. అప్పుడే నా దృష్టి క్యాబ్ లపై పడింది.  రానురానూ  వీటికి  పెరుగుతున్న ఆదరణ నన్ను ఆకర్షించింది. పెరుగుతున్న ట్రాఫిక్, దానివల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం కూడా నా దృష్టిని దాటిపోలేదు. 
  అందుకే నేను ఎంచుకున్న మార్గం ఈ-కార్స్.  ‘ఈ గో రైడ్స్’ ను ప్రారంభించాను.  మొదట రెండు వాహనాలతో విజయవాడలో  ఈ-రిక్షా సేవలను ప్రారంభించాం.   రోజుకు 10 నుంచి 20 బుకింగ్ లను పొందగలుగుతున్నాం.  ఇది మాలో ఆశలకు కొత్త జీవం పోసింది. త్వరలోనే హైదరాబాద్ లో క్యాబ్స్ ప్రవేశపెట్టనున్నాము. అంతేకాకుండా మా ఈ- వెహికల్స్ లో ప్రయాణించే వారి కోసం వైఫై , జీపీఎస్ సదుపాయం కూడా కల్పించనున్నాం. మహిళల భద్రత నేపథ్యంలో  ప్రత్యేకంగా కెమేరాను కూడా  ఏర్పాటు చేస్తున్నాం.


కారణమిదే...


నేను పర్యావరణ ప్రేమికురాలిని.  విషపూరిత వాయువులను మానవాళికి హాని కలిగించని రీయూజబుల్ వాయువులుగా మార్చాలనే ఆలోచన ఉండేది. కానీ దానికి విస్తృత పరిశోధన, డబ్బు, వనరులు అవసరమవుతాయి. కానీ దానిని నేరవేర్చుకోవడానికి అవసరమైన  సాధనాలు  కానీ, సాంకేతిక నైపుణ్యం కానీ నాకు లభించలేదు.  దీంతో పర్యావరణాన్ని రక్షించేలా వేరే మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నాను. అలా పరిశీలిస్తున్నపుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-వెహికల్స్ పైకి దృష్టిసారించాను.
ఒక సాధారణ కారు కిలోమీటరుకు 150-250 గ్రాముల  కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. వీటి బదులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తే ?  వాహన కాలు ష్యం నమ్మశక్యం కాని విధంగా  75% వరకూ తగ్గిపోతుంది.  ఇవన్నీ  పరిశీలించాక  నేను వెతుకుతున్న మార్గం ఇదేనని అనిపించింది.  ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో  ఎలక్ట్రానిక్  వాహనాలకు  నిశ్చయంగా  ఆదరణ  పెరుగుతుంది.  పైగా వినియోగదారులకు కూడా  ఇవి అత్యంత అనుకూలం.

 

 

ఆటుపోట్లు...


ఆలోచన రావడం, మొదలు పెట్టడం వరకూ బాగానే సాగింది. కానీ ఆ తరువాతే ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వెహికల్  చార్జింగ్ సదుపాయాలను ఏర్పరచడంలోనూ,  డ్రైవర్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవడం, పెట్టుబడులను పోగేయడంలోనూ  చిక్కులెన్నో  ఎదుర్కోవాల్సి వచ్చింది.  పెట్టుబడిపెట్టేవారి కోసం ఇప్పటికీ  ఎదురుచూస్తున్నాం. 
   అన్నట్టు  చెప్పడం మరచిపోయాను. మా దగ్గర మహిళా డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. మహిళలు ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా వారి కాళ్లపై వాళ్లు నిలబడాలనే ఉద్దేశంతోనే వారిని ఎంచుకున్నాను. తద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నా అభిప్రాయం.
వీరికి ప్రత్యేకంగా ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం శిక్షణను అందిస్తాం. ఇందుకోసం మాకు ప్రత్యేకమైన శిక్షణ బృందం కూడా ఉంది. అదనంగా ఆత్మ రక్షణ, వ్యక్తిత్వ వికాసంపైనా శిక్షణను ఇస్తున్నాం. ఇదంతా వారిపై వారికి నమ్మకంతోపాటు ఏదైనా చేయగలరనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసమే.

 

భవిష్యత్తు ఉంది...


 పర్యావరణ హిత ఇంధనాన్ని ప్రోత్సహించాలని ప్రపంచవ్యాప్తంగా సూచనలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పారిస్ ఒప్పందం కూడా దీనికి సంబంధించిందే. కాబట్టి రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరగడం ఖాయం. భారత్ లోనూ దీనికి సంబంధించిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా సంస్థలు ఎలక్రిక్  వాహనాలకు సంబంధించిన సంస్థలను నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో  ఈ రంగానికి ఢోకా లేదు.

loader