Asianet News TeluguAsianet News Telugu

సొంతింటి కల ఇలా నిజం చేసుకోండి..!

  • ఒకప్పటిలాగా కాకుండా.. చేతిలో పూర్తి డబ్బు ఉంటేనే ఇల్లు కొనాలి అనేమీ లేదు. బ్యాంకులు, రుణ సంస్థలు సులుభంగా గృహరుణాలు అందిస్తున్నాయి
  • బ్యాంకులు, రుణ సంస్థలు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తాయి? మీ దరఖాస్తును ఎలా పరిశీలిస్తాయి అనే విషయాలను తెలుసుకోవాలి.
  • మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న ఖాతాదారులపై బ్యాంకులు సానుకూల దృక్పథం ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోరు ఉంటే.. రుణం వచ్చే అవకాశాలు అంత బాగుంటాయి.
A beginners guide to taking a home loan

 

సొంతిల్లు ప్రతి ఇక్కరి కల. దానిని సాకారం చేసుకునేందుకు చాలా మంది వ్యయప్రసాయలు పడుతుంటారు. ఎంతో శ్రమ కోర్చి, సమయం వెచ్చించి మరీ తమకు నచ్చిన ఇంటిని వెతుక్కొంటారు. మరి మన జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే విషయాలను పరిగణలోని తీసుకోవాలి.. ముఖ్యంగా  రుణం తో ఇళ్లు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 

ఒకప్పటిలాగా కాకుండా.. చేతిలో పూర్తి డబ్బు ఉంటేనే ఇల్లు కొనాలి అనేమీ లేదు. బ్యాంకులు, రుణ సంస్థలు సులుభంగా గృహరుణాలు అందిస్తున్నాయి. వీటితో ఎంతోమంది సులభంగా తమ స్వగృహ కలను తీర్చుకునేందుకు వీలవుతోంది. అయితే, రుణం తీసుకునేముందు మీకు ఎంత రుణం రావచ్చు? బ్యాంకులు, రుణ సంస్థలు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తాయి? మీ దరఖాస్తును ఎలా పరిశీలిస్తాయి అనే విషయాలను తెలుసుకోవాలి.

 

క్రెడిట్ కార్డు స్కోరు చాలా ముఖ్యం..

కొత్తగా రుణం రావాలంటే.. మంచి క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర, ఆదాయం అన్నీ సరిగ్గా ఉండాలి. అంతమాత్రాన రుణం కచ్చితంగా వస్తుందనీ చెప్పలేం. ఆదాయంతో పోలిస్తే.. అప్పులు తక్కువగా ఉండాలి. అప్పుడే అనుకున్న రుణం దొరకుతుంది. రుణాలు, క్రెడిట్‌ కార్డులు ఇచ్చేప్పుడు బ్యాంకులు రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరును నిశితంగా గమనిస్తాయి. రుణ చెల్లింపులో క్రమశిక్షణ ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు సులభంగా అప్పులు ఇస్తాయి.

 మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న ఖాతాదారులపై బ్యాంకులు సానుకూల దృక్పథం ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోరు ఉంటే.. రుణం వచ్చే అవకాశాలు అంత బాగుంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. అప్పు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా బ్యాంకు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కేవలం సిబిల్‌ స్కోరు ఒక్కటే ఆధారంగా చేసుకొని బ్యాంకు అప్పు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించదు.

రుణం తీసుకోవాలనుకున్నప్పుడు.. సిబిల్‌ ట్రాన్స్‌యూనియన్‌ స్కోరు, రుణ చరిత్ర మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తీసుకున్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలను, క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ఎప్పుడూ మర్చిపోకూడదు. బిల్లులు సరిగ్గా చెల్లించకపోతే.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఇది చివరకు అవసరం అయినప్పుడు రుణం రాకుండా చేస్తుంది.

 ఇంటికి సంబంధించిన పత్రాలు..

రుణాన్ని ఇచ్చేముందు సంస్థలు ముందుగా పరిశీలించేది మీరు కొనాలనుకుంటున్న ఇంటికి సంబంధించిన పత్రాలను. మీరు ఎంపిక చేసుకున్న ఇల్లు అన్ని అనుమతులకూ లోబడి నిర్మించారా లేదా? అనేదానితోపాటు.. ఇతర అంశాలనూ పరిశీలిస్తాయి. ఇవన్నీ సరిచూసుకున్నాక, బ్యాంకులకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే.. అప్పుడు మీ ఆదాయానికి సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు. దీనికోసం కనీసం 6నెలల మీ వేతనం వివరాలు, గత మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులు అవసరం అవుతాయి. ఇతర పత్రాలు అంటే మీ పుట్టిన తేదీ ధ్రువీకరణ, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా, పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాల్లాంటివీ అవసరమే. రుణం తీసుకోబోయే ఈ పత్రాలకు సంబంధించి పట్టికలాంటిది తయారు చేసుకొని అందులో ఒక్కోదాన్నీ సరిచూసుకోండి. అన్ని పత్రాలనూ ముందే సిద్ధం చేసుకోవడం వల్ల చివరి నిమిషంలో హడావుడి పడాల్సిన అవసరం ఉండదు.

లోన్ విషయంలో బ్యాంకులు వయసును కేవలం ఒక సంఖ్యగా పరిగణించరు. మీ వయసును బట్టి మీ దరఖాస్తును పరిశీలిస్తారు. ఒక వేళ మీ వయసు  పదవీ విరమణకు దగ్గరగా ఉందంటే.. మీ లోన్ రిజక్ట్ అయినట్టే. ఎందుకంటే మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించగలరో లేదో.. అనే అనుమానం వారిలో ఉంటుంది. 25నుంచి 30 వయసు వారికైతే రుణం త్వరగా వచ్చే అవకాశం ఉంది. వీరితో పోలిస్తే.. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు రుణం చెల్లించడం కష్టమని వారి భావన.వయసు ఎక్కువగా ఉన్నవారు షార్ట్ టర్మ్ విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా రుణాన్ని త్వరగా పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది.

ఎంత రుణం కోసం అప్లై చేస్తున్నారు..

మీరు అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు, రుణ సంస్థలు.. మీ ఆదాయాన్ని అంచనా వేస్తాయి. మీకు వచ్చే ఆదాయానికి.. నెలకు ఎంత వాయిదాలు చెల్లిస్తున్నారు లాంటి విషయాలు పరిగణిస్తాయి. నెలసరి ఆదాయంలో 50శాతానికి లోపు నెలసరి వాయిదాలు ఉండటం మంచిది. ఒక వేళ మీకు ఇతర రుణాలు ఏవైనా ఉంటే.. మీ భార్య/ భర్త, పిల్లల పేరు మీదకు మార్చకుంటే మంచిది. అలా చేస్తే.. మీకు రుణం ఎక్కవ వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ఎంఐ విధానం...

మీరు ఇంటి కోసం తీసుకున్న లోన్ ను తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ విధానం ఉపయోగించవచ్చు. ఇది మీరు తీసుకున్న ఇంటి లోను వడ్డీ రేటును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలా కొంచెం కొంచెంగా చెల్లించవచ్చు.

ప్రీ- పేమెంట్ విధానం..

 మీరు ఇంటి కోసం లోన్ తీసుకున్నారు.. నెల నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వస్తున్నారనుకుందాం. ఆఫీసులో ఏదైనా బోనస్ ఇవ్వడం లేదా ఇంకేదైనా కారణం చేత మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు చేకూరితే ప్రీ పేమెంట్ విధానం ద్వారా రుణం చెల్లించవచ్చు..దీని ద్వారా మీకు వడ్డీ శాతం తగ్గే అవాకశం ఉంటుంది.

 పన్ను తగ్గింపు..

హోమ్ లోన్స్ తీసుకోవడం ద్వారా.. మీరు పన్ను నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.  లోన్ తీసుకొని ఉన్నారు కనుక.. మీకు ప్రభుత్వం విధించే పన్నులో రాయితీ లభిస్తుంది.

 అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్. కామ్ సీఈవో

Follow Us:
Download App:
  • android
  • ios