పూర్వం.. జాతకంలో దోషాలు ఉంటే.. రావిచెట్టుకి ఇచ్చి పెళ్లి జరిపించేవారు. అలా చేస్తే.. దోషం పోయి.. వారికి పెళ్లి జరుగుతుందని నమ్మేవాళ్లు. అయితే.. ఇప్పుడు కాలం మారిపోయింది.  జాతకాలు లాంటివి నమ్మే వాళ్లు కూడా తగ్గిపోయారు. టెక్నాలజీ వెంట పరిగెడుతున్నారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికే మూఢనమ్మకాల ముసుగులో జీవించేవారు ఉన్నారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ.

ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు. తరచూ అనారోగ్యం పాలౌతున్నాడు. దీంతో ఈ బాలుడి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. అది కూడా ఓ చిన్న కుక్కపిల్లతో. అలా కుక్కపిల్లతో పెళ్లి చేస్తే.. అతనికి ఉన్న జబ్బులన్నీ తగ్గిపోయి.. సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనేది వారి నమ్మకం.  అందుకే గ్రామస్థులందరినీ ఆహ్వానించి అందరి ఎదుటా.. కుక్కపిల్లతో పెళ్లి జరిపించారు.  ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని పోట్కా ప్రాంతంలో జరిగింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి.. చివరకు బయటకు వచ్చింది. ఈ పెళ్లి గురించి విన్నవారు కొందరు ఇదేమి వింత సంప్రదాయం అని ఆశ్చర్యపోతుంటే.. మరికొందరేమో.. దీనిని ఖండిస్తున్నారు. బాలుడికి అనారోగ్యంగా ఉంటే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి కానీ.. ఇలా కుక్కపిల్లతో పెళ్లి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.