దేశం ప్రశాంతంగా ఉంది అంటే.. అందుకు సరిహద్దుల్లో ఉన్న జవాన్లే కారణం. శత్రువుల నుంచి రాత్రి, పగలు అనే తేడా లేకుండా వాళ్లు దేశాన్ని కాపాడుతుంటారు. దేశ కోసం ప్రాణత్యాగానికి నిత్యం సిద్ధంగా ఉండే జవాన్లు.. దాదాపు 700మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. గడిచిన ఆరేళ్లలో కేంద్ర బలగాలకు చెందిన దాదాపు 700మంది జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ గురువారం పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలియజేసింది.

నిస్సత్తువ, ఒంటరితనం, ఇంట్లో కారణాల వల్ల ఈ ఆత్మహత్యలు జరిగినట్లు కేంద్ర హోంశాఖ తన రిపోర్ట్‌ లో వెల్లడించింది. కేంద్ర బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎప్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్ దళాలకు చెందిన జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడినట్లు కేంద్రం తెలిపింది. సీఆర్‌పీఎఫ్‌లో 2012 నుంచి 189 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 175 మంది వివిధ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయారు. 2001 నుంచి బీఎస్‌ఎఫ్‌లో 529 సుసైడ్ చేసుకున్నారు. మరో 491 మంది దాడుల్లో మృతిచెందారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్‌లోనూ 2006 నుంచి 62 మంది ఆత్మహతకు పాల్పడ్డారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్‌లో 63 మంది సుసైడ్ చేసుకున్నారు. 2013 నుంచి శశస్త్ర సీమా బల్‌లో 32 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుంచి అస్సాం రైఫిల్స్‌లో 27 మంది సుసైడ్ చేసుకున్నారు.