ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్ట్ అయ్యిందా..? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

7 Reasons Behind Insurance Claim Rejection And How To Avoid Them
Highlights

  • మనం తీసుకునే ఇన్సూరెన్స్ లే.. మన కుటుంబానికి కష్టకాలంలో ఉపయోగపడతాయి.  
  • ఒకప్పుడైతే పెద్దగా వీటిపై ఆసక్తి చూపించేవారు కాదు
  • కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది.  ప్రతీదానికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు

ఇన్సూరెన్స్.. ప్రస్తుత రోజుల్లో చాలా అవసరం.  మనం తీసుకునే ఇన్సూరెన్స్ లే.. మన కుటుంబానికి కష్టకాలంలో ఉపయోగపడతాయి.  ఒకప్పుడైతే పెద్దగా వీటిపై ఆసక్తి చూపించేవారు కాదు కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది.  ప్రతీదానికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అయితే.. ఎంతో కష్టపడి ఇన్సూరెన్స్ కట్టి.. చివరికి దానిని క్లైమ్ చేసుకునే సమయానికి అది రిజెక్ట్ అయ్యిందనుకోండి చాలా బాధగా ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పిదాలే.. క్లైమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణమౌతుంటాయి. అసలు ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.       

    

ఇన్సూరెన్స్ ఫాం మీరే పూర్తి చేయండి..

మనలో చాలా మంది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో పన్ను   ఆదా అవుతుందని భావిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్   తీసుకోవడం అంటే హడావిడిగా జరిగిపోతుంది. దీంతో.. ఇన్సూరెన్స్ పేపర్లు ఫిల్ చేసే సమయంలో సమాచారాన్ని ఇన్సూరెన్స్ ఎంజెట్లకే వదిలిపెడుతుంటారు. అలా కాకుండా ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడే.. మీరే జాగ్రత్తగా దానిని పూర్తి చేయాలి. అప్పుడు.. దానిని క్లైమ్ చేసుకునే సమయంలో మీరుగానీ, మీ కుటుంబసభ్యులు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుపడకుండా ఉంటాయి. అంతేకాకుండా.. ఇన్సూరెన్స్ పేపర్లు పూర్తి చేసిన తర్వాత ఏజెంట్ కి ఇచ్చేముందు సేమ్ కాపీ ఒకటి మీ దగ్గర కూడా ఉంచుకోవాలి. దాని ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే.. సరిచూసుకునే అవకాశం ఉంటుంది.

తప్పుడు సమాచారం..

ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు చాలా పారదర్శకంగా వ్యవహరించాలి. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని అందులో పెట్టకూడదు. మీ వయసు, ఎత్తు, బరువు,వృత్తి, ఆదాయం తదితర వివరాలన్నీ నిజమైనవే ఇవ్వాలి. వీటిల్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే.. భవిష్యత్తులో క్లైమ్ చేసుకునేటప్పుడు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

అనారోగ్య వివరాలు...

చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం అనారోగ్య సమస్యలు. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో.. అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పాలి. లేకపోతే దానివల్ల క్లైమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి.. పాలసీ తీసుకునే సమయంలోనే కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలను కూడా అందులో పొందుపరచాలి. అదేవిధంగా ఎలాంటి రోగాలకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది లాంటి సమాచారాన్ని కూడా ముందే తెలుసుకోవాలి.

ఉద్యోగ వివరాలు..

పాలసీ తీసుకునేటప్పుడు మీ ఉద్యోగ వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఉద్యోగాలు.. చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ మరికొన్ని ఉద్యోగాలు చాలా టెన్షన్ తో కూడుకొని ఉంటాయి. ప్రాణాలకు ముప్పు తెచ్చేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు మైన్స్ లో పనిచేసేవారు, ఫైర్ ఫైటర్స్, కన్ స్ట్రక్షన్ విభాగంలో పనిచేసేవారికి కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేరు. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని పాలసీ తీసుకోవాలి.

పాలసీలో లాప్స్ ఉండకుండా చూసుకోవాలి...

యాక్టివ్ పాలసీలకే త్వరగా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ పే చేసే సమయంలో ఎక్కువ లాప్స్ తీసుకుంటే.. క్లైమ్ చేసుకోవాల్సిన సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అసంబద్థ వినియోగం..

మీరు ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకుందాం.. మీరు నార్మల్ కారును కొని.. దానిని కమర్షియల్ పర్పస్ కింద వినియోగించారు. కారుకి ఏదైనా ప్రమాదం జరిగింది.. అప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుందామనుకుంటే అది రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే.. కమర్షియల్ పర్పస్ కోసమే కారు కొనుగోలు చేస్తే.. దానికి సంబంధించిన పాలసీలు ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన పాలసీలు ఉంటాయి. కాబట్టి.. ఒక దాని కోసం కొని.. మరో దాని కోసం ఉపయోగించకూడదు. దానివల్ల ఇన్సూరెన్స్ కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు తాగి వాహనం నడిపినా, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వదు.

నామినీ డీటైల్స్..

నామినీ డీటైల్స్ అప్ డేట్ చేయడం చాలా అవసరం. మీ తర్వాత మీ కుటుంబాన్ని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహించగలుగుతారో వారినే నామినీగా ఎంచుకోండి. మీ తల్లిదండ్రులు, భార్య/భర్త, పిల్లలను నామినీగా పెట్టుకోవచ్చు.

పైన చెప్పిన అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. మీ ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.

 

        అధిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

loader