ఉత్తరప్రదేశ్ లో ఈరోజు మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ రైలు ఈరోజు ప్రమాదానికి గురయ్యింది నెల వ్యవధిలో యూపీలో రైలు ప్రమాదం చోటుచేసుకోవడం ఇది మూడోసారి.

ఉత్తరప్రదేశ్ లో ఈరోజు మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హౌరా నుంచి జబల్ పూర్ వెళుతున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ రైలు ఈరోజు ప్రమాదానికి గురయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లా ఓబ్రా డామ్ స్టేషన్ వద్ద గురువారం ఉదయం ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలు ఏడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి.

హౌరా నుంచి రైలు గురువారం ఉదయం 6గంటల ప్రాంతంలో బయలు దేరిందని.. సోన్ భద్ర వద్ద ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ సక్సేనా దిల్లీలో తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో రైలు గంటకు 40కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. అయితే..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ప్రయాణికులందరినీ వేరే బోగీలలో తరలించినట్లు సక్సేనా చెప్పారు.

ఏడు బోగీలు పక్కకు ఓరిగిపోయాయని.. తర్వాత వాటిని తిరిగి సరిచేసినట్లు తూర్పుమధ్యరైల్వే పీఆర్వో ఆర్కేసింగ్ చెప్పారు. ఈ సోన్ భద్ర ప్రాంతం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి 80కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నెల వ్యవధిలో యూపీలో రైలు ప్రమాదం చోటుచేసుకోవడం ఇది మూడోసారి.

గత నెల ఆగస్టు 19న ఉత్కల్ ఎక్సెప్రెస్ రైలు ప్రమాదంలో 22మంది మృతిచెందగా 150మందికి పైగా గాయాలపాలయ్యారు.ఆగస్టు 23న జరిగిన మరో రైలు ప్రమాదంలో 100మందికి పైగా గాయాలపాలయ్యారు.