ముంబయి తీరంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) ఉద్యోగులతో ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ శనివారం ఉదయం అదృశ్యమైంది. ముంబయిలోని జుహు విమానాశ్రయం నుంచి ఉదయం 10.20గం. టేకాఫ్‌ అయిన హెలికాప్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం 10.58గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ 10.30గం. సమయంలో హెలికాప్టర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీఎస్‌)తో సంబంధాలు తెగిపోయింది. ఇందులో ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. హెలికాప్టర్‌ కోసం గాలింపు చేపట్టిన సిబ్బంది.. చివరికి అది కూలిపోయినట్లు గుర్తించారు. హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు.