ఈ ఏడాది పలు కంపెనీల్లోని ఉద్యోగుల జీతాలు 10శాతం పెరగనున్నాయి. అంతేకాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగనున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీస్, ఐటీ కెరీర్ సెక్టార్ లలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కంపెనీల జీతభత్యాలు, సిబ్బందిపై మెర్సర్స్‌ - 2017 ఇండియా టోటల్‌ రెమ్యునరేషన్‌  చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ప్రకారం.. 2016, 2017తో పోలిస్తే.. ఈ నూతన సంవత్సరంలో నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కువగా లభించనున్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారి జీతాలు 10శాతం పెరగనున్నాయి. మొత్తం 791 ఆర్గనైజేషన్స్ పై సర్వే చేయగా.. వాటిలో 55శాతం కంపెనీలు.. కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి.

నైపుణ్యం గల ఉద్యోగుల కొరత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏర్పడిందని అందుకే కంపెనీలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయని మెర్సర్‌ ఇండియా బిజినెస్‌ లీడర్‌ శాంతి నరేశ్‌ తెలిపారు. ప్రతి రెండు సంస్థల్లో ఒకటి ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నట్లు సర్వే తెలిపింది. తయారీ, సేల్స్‌, డిజైనింగ్‌, అనలటిక్‌ రంగాల్లో బాధ్యతలు ఎక్కువ కావడంతో కొత్త సిబ్బంది నియామకాలు అనివార్యమైనట్లు తెలుస్తోంది. అంతేగాక.. క్లౌడ్‌, సెక్యూరిటీ, డేటా సైన్స్‌ తదితర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఈ ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి.