భారత మార్కెట్ లోకి మారుతి సుజుకీ మరో లేటెస్ట్ జనరేషన్ కారును ప్రవేశపెడుతోంది. ఇటీవల విడుదల చేసిన స్విఫ్ట్  డిజైర్ అమ్మకాలు విపరీతంగా జరిగాయి. దీంతో.. నూతన సంవత్సరంలో దాని నెక్ట్స్ వర్షన్ కారును ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే  కొత్త స్విఫ్ట్‌కు చెందిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా చూస్తే కొత్త వెర్షన్‌ను ప్రీమియం కార్లకు పోటీగా తీర్చి దిద్దినట్లు అర్థమవుతోంది. 

గత మోడల్స్ తో పోలిస్తే.. ఈ మోడల్ డిజైన్ లో చాలా మార్పులు చేశారు. కొత్త డిజైన్‌ హెక్సాజోనల్‌ గ్రిల్‌ను అమర్చారు. కొత్త డిజైన్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌, ఓఆర్‌ఎం ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు ఇందులో  ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కూడా అమర్చారు. దీనిలో నేవిగేషన్‌తోపాటు బ్లూటూత్‌ అనుసంధానం, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లే సౌకర్యాలు ఉన్నాయి. గురువారం నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ కొత్త మోడల్ స్విఫ్ట్ కారును బుక్ చేసుకోవాలంటే రూ.11వేలు చెల్లించాల్సి ఉంటుంది.