13ఏళ్ల బాలుడు ఈ గేమ్ ఆడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గత కొంత కాలంగా తన తండ్రి మొబైల్ ఫోన్ లో బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు.
బ్లూవేల్ భూతానికి మరో బాలుడు బలయ్యాడు. ఇప్పటికే భారత్ లో ఈ ఆన్ లైన్ ఛాలెంజింగ్ గేమ్ ఆడుతూ పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రదేశ్ కి చెందిన పార్థ్ సింగ్ అనే 13ఏళ్ల బాలుడు ఈ గేమ్ ఆడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం .. హమీర్ పుర జిల్లా మౌడహ గ్రామానికి చెందిన పార్థ్ సింగ్(13) ఆరో తరగతి చదువుతున్నాడు. అతను గత కొంత కాలంగా తన తండ్రి మొబైల్ ఫోన్ లో బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. ఆదివారం సాయంత్రం పార్థ్ సింగ్.. తన మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాల్సి ఉంది.. కాగా.. అక్కడికి వెళ్లకుండా గేమ్ ఆడుతూ బెడ్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో.. అతని తండ్రి తలుపులు పగలకొట్టి చూడగా.. ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించాడు. అతని చేతిలో ఫోన్ ఉండగా.. అందులో బ్లూవేల్ గేమ్ 50వ ఛాలెంజ్ ఆడుతున్నట్లుగా ఉంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
బ్లూవేల్ గేమ్ ఆడుతూ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు మౌడహ సర్కిల్ ఆఫీసర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. ఫోన్ ని ఐటీ నిపుణులకు పంపి.. గేమ్ హిస్టరీని చూడాల్సిందిగా కోరనున్నట్లు చెప్పారు.
