పీకల దాకా తాగి.. తన తండ్రి తనను విచక్షణా రహితంగా కొడుతున్నాడంటూ 11ఏళ్ల బాలుడు పోలీసు స్టేషన్ ని ఆశ్రయించిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట పరిధిలో ని మోత్కులగూడెం గ్రామానికి చెందిన మోలుగూరి శ్రీనివాస్-రమ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతులు కూలీ చేసుకొని జీవిస్తున్నారు. కొడుకు శశికుమార్(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా, శ్రీనివాస్ నిత్యం ఏదో ఒక కారణంతో భార్య, కొడుకును కొడుతున్నాడు. ఇంట్లో నగదు పోయిందనే కారణం చూపించి బాలుడిని రెండు రోజులు కొట్టాడు. అది చాలదన్నట్టు  గురువారం సాయంత్రం బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి దుడ్డు కర్రకు కారం పూసి విచక్షణరహితంగా చితకబాదగా, భరించలేక బాలుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భార్యనూ శ్రీనివాస్ వెళ్లగొట్టాడు. దీంతో బాలుడు తల్లితో కలిసి జమ్మికుంట సీఐని ఆశ్రయించాడు.  తనకు ఈ తండ్రి వద్దంటూ సీఐ కి మొరపెట్టుకున్నాడు. బాలుడి ఒంటిపై గాయాలు, అతను చెప్పినదంతా విన్న సీఐ చలించిపోయాడు. వెంటనే బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.