టెక్సాస్ స్కూల్లో కాల్పులకు తెగబడిన విద్యార్థి: 10 మంది మృతి

First Published 19, May 2018, 7:36 AM IST
10 Killed In Texas High School Shooting
Highlights

అమెరికాలో మరోసారి తుపాకుల మోత చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని హైస్కూల్లో ఓ దుండగుడు కాల్పులతో విరుచుకుపడ్డాడు.

టెక్సాస్‌: అమెరికాలో మరోసారి తుపాకుల మోత చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని హైస్కూల్లో ఓ దుండగుడు కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ దారుణ ఘటనలో 10మంది విద్యార్థుల వరకు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు.

శాంటా ఉన్నత పాఠశాలలో ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని అరెస్టు చేసినట్టు సమాచారం. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. శాంటా హైస్కూల్‌లోకి ఓ వ్యక్తి తుపాకీ పట్టుకొని తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

తుపాకి పేలుడు శబ్దాలు రావడంతో తరగతి గదుల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు..

ఈ పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలుస్తోంది. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. 

సాయుధుడిని 17 ఏళ్ల డిమిట్రియోస్ పాగౌర్టిజిస్ గా గుర్తించారు. అతను అదే పాఠశాలలో చదువుతున్నాడు.  టెక్సాస్ స్కూళ్లలో ఇటువంటి కిరాతకమైన ఘటన ఇప్పటి వరకు జరగలేదని గవర్నర్ గ్రెగ్ అబ్బోట్ అన్నారు.

సాయుధుడు తన తండ్రికి చెందిన పాయింట్ 38 రివాల్వర్ ను తీసుకుని వచ్చినట్లు తెలుస్తోందని అబ్బోట్ అన్నారు.

loader